Rajiv Yuva Vikasam: గేమ్‌ ఛేంజర్‌ స్కీమ్‌కు సిబిల్‌ స్కోర్‌ షాక్‌..!

లోన్‌ కావాలా నాయనా!..సర్కార్‌ వారి ప్రకటనకు యువత ఫిదా అయ్యారు. 16 లక్షలకు పైగా అప్లికేషన్లు పోటెత్తాయి. తీరా ఇప్పుడు గేమ్‌ ఛేంజర్‌ స్కీమ్‌కు సిబిల్‌ స్కోర్‌ షాక్‌ తగిలింది. రాజీవ్‌ యువ వికాస రుణాలపై దరఖాస్తుదారుల్లో గందరగోళం ఏర్పడింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

Rajiv Yuva Vikasam: గేమ్‌ ఛేంజర్‌ స్కీమ్‌కు సిబిల్‌ స్కోర్‌ షాక్‌..!
Rajiv Yuva Vikasam Scheme

Updated on: May 13, 2025 | 6:42 AM

తెలంగాణలో రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ సర్కార్‌ ఆరు గ్యారెంటీల్లో భాగంగా గేమ్‌ఛేంజర్‌ పథకంపై యువతకు భరోసానిచ్చింది. సబ్సిడీ రుణాల కోసం 16 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు.వాటి స్క్రూటిని కూడా శరవేగంగా సాగుతోంది. కానీ సడెన్‌ సిబిల్‌ నిబంధనలు దరఖాస్తుదారులను పరేషాన్‌ చేస్తున్నాయి. సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే.. వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అలానే గతంలో గృహ, వ్యవసాయ, వాహన లేదా పర్సనల్ లోన్స్ తీసుకొని తిరిగి చెల్లించని వారి దరఖాస్తులను కూడా రిజెక్ట్ చేస్తారని సమాచారం.

లోన్ అప్లికేషన్‌కు ముందు సిబిల్ స్కోర్‌ను తప్పనిసరిగా పరిశీలించనున్న బ్యాంకులు, దానికి సంబంధించి ఫీజు కూడా వసూలు చేయనున్నాయి. ప్రతి అప్లికేషన్‌కి రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేసే యోచనలో కొన్ని బ్యాంకులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.

తక్కువ ఆదాయ వర్గాల అభ్యర్థులపై భారం పడకుండా చూడాలనే ఉద్దేశంతో బ్యాంకులు వసూలు చేసే ఫీజును మినహాయించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నివేదించనున్నారు. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (SLBC) సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకానికి 16,25,441 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం మండల స్థాయిలో దాదాపు 90 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు అధికారులు తెలిపారు. తుది జాబితా ఈ నెలాఖరులో అందుబాటులోకి రానుంది. మండల అధికారులు పరిశీలించిన దరఖాస్తులను బ్యాంకులకు పంపించి అర్హుల ఎంపిక జరుగుతుంది. తుది జాబితా తయారైన తర్వాత అదే కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అందజేస్తారు. సిబిల్‌ స్కోర్‌ తమ ఆశలకు గల్లంతు చేస్తుందా?అనే ఆందోళన వున్నా..సర్కార్‌ వారి మాట ప్రకారం తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నారు అర్హులు.

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్దిదారులకు రుణాల మంజూరు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొదటి విడతలో సుమారు 5 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనం అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్ఱభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తుంది.  ఈ పథకం ద్వారా సొంత బిజినెస్ పెట్టాలనుకునే యవతకు ఆర్థిక సాయం చేయనున్నారు. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు సబ్సిడీతో కూడిన లోన్స్ బ్యాంకుల ద్వారా మంజూరు చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..