Telangana: అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..

| Edited By: Velpula Bharath Rao

Nov 21, 2024 | 2:05 PM

మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ఆసరాగా ఉండాల్సిన రక్తసంబంధీకులే రాబందులుగా మారుతున్నారు.

Telangana: అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
Police Registered A Case Of Cheating Against The Blood Relatives In Nalgonda
Follow us on

ఒంటరిగా ఉన్న నిరక్షరాస్యురాలైన వృద్ధురాలి కోట్ల రూపాయల ఆస్తిని కాజేసేందుకు రక్తసంబంధీకులే రాబందులుగా మారి స్కెచ్ వేశారు. వృద్ధురాలికి చెందిన భూమిలో కొంతభాగమే కొనుగోలు చేసిన సదరు బంధువులు అడ్డదారిలో మొత్తం భూమిని అక్రమంగా కాజేశారు. చివరికి విషయం తెలుసుకున్న ఆమె లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కింది. చివరికి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

నల్లగొండ మండలం చిన్నసూరారంకు చెందిన కర్ర శ్రీరాములమ్మ 70 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులైన వృద్ధురాలు. ఆమె భర్త కొన్నేళ్ల క్రితమే చనిపోగా, ఉన్న ఒక్కగానొక్క కొడుకు 2023లో అకాలమరణం చెందాడు. దీంతో గ్రామంలోనే శ్రీరాములమ్మ ఒంటరిగా బతుకుతుంది. ఈమెకు గ్రామ పరిధిలోని నకిరేకల్‌- నాగార్జున సాగర్‌ జాతీయ రహదారికి పక్కన 2.37 ఎకరాల భూమి ఉంది. ఇందులో 33 గుంటల భూమిని ఆమె బంధువు తల్లమల్ల హుస్సేన్ భూమిని కొనుగోలు చేసేందుకు గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం 16 లక్షల రూపాయలు చెల్లించాడు. అక్టోబరు 17న రిజిస్ట్రేషన్‌ కోసం శ్రీరాములమ్మను తహసీల్దార్‌ కార్యాలయానికి హుస్సేన్ తీసుకువెళ్లాడు. ఆ సమయంలో రూ.21లక్షలు ఇచ్చానని, 33గుంటల విక్రయానికి బదులు తన మొత్తం భూమి 2.33ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. అక్టోబరు 30న పాస్‌బుక్‌ వివరాలను సరిచేయించుకునేందుకు గ్రామస్థుల సహకారంతో తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లగా మొత్తం భూమి హుస్సేన్‌ పేరున బదిలీ అయిన విషయం తెలిసి కన్నీరు మున్నీరైంది. ఒక్క రోజు తేడాతో మొత్తం భూమిని హుస్సేన్ కుమారులతో పాటు, మరొకరి పేరున రిజిస్ట్రేషన్‌ చేశాడు. రిజిస్ట్రేషన్‌ సమయంలో తనతో డాక్యుమెంట్లతో పాటు మరో రెండు ఖాళీ స్టాంప్‌ పేపర్లపై తనతో వేలిముద్రలు చేయించుకున్నారని శ్రీరాములమ్మ చెబుతోంది.

పోలీసుల రంగ ప్రవేశంతో..

తన భూమిని కాజేసిన హుస్సేన్ పై శ్రీరాములమ్మ తిప్పర్తి పోలీసులకు చేసిన ఫిర్యాదుతో ఎస్సై సాయి ప్రశాంత్‌ విచారణ చేపట్టారు. వృద్ధురాలు, హుస్సేన్‌ మధ్య 33గుంటల భూమి విక్రయానికి సంబంధించి మాత్రమే అగ్రిమెంట్‌ ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. వృద్ధురాలిని మోసం చేసి భూమిని అక్రమంగా కాజేసినట్లు పోలీసులు నిర్ధారించారు. శ్రీరాములమ్మ ఫిర్యాదు మేరకు హుస్సేన్‌, అతడి ఇద్దరు కుమారులపై పోలీసులు ఛీటింగ్‌ కేసు నమోదు చేశారు.

మరిన్ని తెలంగాాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి