
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో జరిగిన ఒక సాధారణ రోడ్డు ప్రమాదం, ఒక యువకుడి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన మర్పల్లి శ్రీనివాస్ కుమారుడు అనిర్వేష్ (20) ఈ నెల 2వ తేదీన గ్రామంలో తన స్కూటీపై వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుండి వచ్చిన ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ కిందపడగా, బుల్లెట్ నడుపుతున్న జాఫర్ అనే వ్యక్తి చేతికి స్వల్ప గాయమైంది. ఇది సాధారణంగా రోడ్లపై జరిగే ప్రమాదమే.
ఈ ఘటనపై జాఫర్ సోదరుడు మోహిజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, పెద్దేముల్ పోలీసులు కనీస విచారణ జరపకుండా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అనిర్వేష్‌పై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా ఈ నెల 8న అతడిని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల ఈ తొందరపాటు చర్య అనిర్వేష్ జీవితాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. అతను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ శాఖ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ నెల 9న దానికి సంబంధించిన కీలకమైన ఇంటర్వ్యూ/డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగాల్సి ఉంది. కానీ, అంతకుముందు రోజే (8వ తేదీన) పోలీసులు అతడిని రిమాండ్‌కు పంపడంతో, అతను ఇంటర్వ్యూకు హాజరు కాలేకపోయాడు. ఫలితంగా చేతికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం చేజారిపోయింది. ఒక వైపు కుమారుడు జైలు పాలు కావడం, మరోవైపు జీవితాన్ని మార్చే ఉద్యోగం పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ కేసులో అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, గాయపడిన జాఫర్ గానీ, అతని కుటుంబ సభ్యులు గానీ ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిందేనని, అనిర్వేష్‌కు తమను చంపే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తున్నారు. అయినా సరే పోలీసులు కేసును పునఃసమీక్షించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తమ కుమారుడి భవిష్యత్తును నాశనం చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, కేసును నిష్పక్షపాతంగా విచారించాలని కోరుతూ అనిర్వేష్ కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి ఆ యువకుడికి న్యాయం చేస్తారో లేదో చూడాలి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..