Hyderabad Crime News: ఇంట్లో చోరికి పాల్పడిన వ్యక్తిని 24 గంటల్లో పట్టించిన నిఘానేత్రం.. ఎలాగంటే..

ఏదైనా పనిమీద ఇంటిల్లిపాది బయటకు వెళ్తే.. ఇదే అదనుగా దొంగలు మాటువేసి ఉంటారు. ఇంట్లో చొరబడి కష్టపడి సంపాదించుకున్న సొత్తును ఎత్తుకెళ్తారు. ఐతే ఓ వ్యక్తి తెలివిగా చేసిన పనితో తన ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తిని 24 గంటలు గడవక ముందే కటకటాలపాలు..

Hyderabad Crime News: ఇంట్లో చోరికి పాల్పడిన వ్యక్తిని 24 గంటల్లో పట్టించిన నిఘానేత్రం.. ఎలాగంటే..
Robbery In House

Updated on: Sep 12, 2022 | 8:41 PM

Telangana Crime News: ఏదైనా పనిమీద ఇంటిల్లిపాది బయటకు వెళ్తే.. ఇదే అదనుగా దొంగలు మాటువేసి ఉంటారు. ఇంట్లో చొరబడి కష్టపడి సంపాదించుకున్న సొత్తును ఎత్తుకెళ్తారు. ఐతే ఓ వ్యక్తి తెలివిగా చేసిన పనితో తన ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తిని 24 గంటలు గడవక ముందే కటకటాలపాలు అయ్యేలా చేశాడు. వివరాల్లోకెళ్తే..

వివరాల్లోకెళ్తే.. మొయినాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో రూ.3 వేల చిన్న కెమెరాను కొని ఇంటి ఆవరణ (హాల్లో) ఉంచాడు. ఈ చిన్న కెమెరాకు వైఫైని కనెక్ట్‌ చేసి తన ఫోన్‌లో నిత్యం దృశ్యాలు కనిపించేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఐతే తాజాగా పనిమీద ఇంటికి తాళం వేసి సదరు వ్యక్తి కూకట్‌పల్లికి వెళ్లాడు. ఇంట్లో ఎవ్వరూ లేరని గమనించిన ఓ దొంగ చొరబడి సీసీ కెమెరాలు, వాటి డీవీఆర్‌లతోపాటు, నగదు, ఇతర సామాగ్రిని దోచుకెళ్లాడు. కూకట్‌పల్లిలో ఉన్న యజమాని తన ఫోన్‌లో చూసుకోగా చిన్న కెమెరా ఫుటేజ్‌ కట్‌ అయినట్లు గ్రహించాడు. వెంటనే అనుమానంతో తన ఇంటి సమీపంలో ఉండే వ్యక్తిని వెళ్లి చూడమన్నాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నట్లు యజమానికి ఫోన్‌లో చెప్పాడు. ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో వస్తువులు కిందపడి ఉండడం చూసి విషయం తెలియజేశాడు. దీంతో యజమాని తన ఫోన్‌లో అప్పటివరకు రికార్డయిన చిన్న కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా దొంగతనం బయటపడింది. తన ఫోన్‌లోని చిన్న కెమెరా ఫుటేజీ ఆధారంగా దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారు. కేవలం రూ.3 వేల కెమెరా సాయంతో ఇదంతా సాధ్యపడింది. ఇలాంటి కెమెరాలను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు ఏర్పాటుచేసుకుంటే ఇళ్లకు భద్రత కల్పించుకోవచ్చని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ శశాంక్‌రెడ్డి మీడియాకు తెలిపారు.