ప్రధాని మోదీ వరంగల్ టూర్ ఫిక్స్ అయింది. వచ్చే నెల 8న వరంగల్‌కు రానున్నారు. మెగా టెక్స్‌టైల్ పార్క్‌తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నాయి. బీజేపీ రాష్ట్రంలో సత్తాచాటాలని మరింత విస్తరించాలని దృష్టిపెట్టింది. దీంతో బీజేపీ ప్రధాన నేతలు ప్రజాక్షేత్రం బాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణపై కమలం పార్టీ ఫుల్ ఫోకస్ పెడుతోంది. జెండా పాతేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. అధికారం దక్కించుకునేందుకు అన్ని అస్త్రాలను ఉపయోగిస్తోంది. బీఆర్ఎస్‌ను ఢీ కొట్టి అధికారంలోకి రావడమే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన తెలంగాణలో అధికారంలోకి వచ్చి లెక్క సరి చేయాలని కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు తెలంగాణలో సభలు పెడుతూ స్పీడ్ పెంచుతున్నారు. ఇప్పటికే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్‌కర్నూల్ బహిరంగ సభలో పాల్గొని కేసీఆర్ సర్కార్‌పై విమర్శల దాడి పెంచారు. తాజాగా.. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల మొదటివారంలో తెలంగాణకు రానున్నారు.
జూలై 8న వరంగల్‌లో ప్రధాని పర్యటించబోతున్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. అనంతరం వరంగల్ లో నిర్మించనున్న మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు భూమి పూజ చేయనున్నారు. అనంతరం హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇక.. 200 ఎకరాల్లో 10 వేల కోట్లతో మెగా టెక్స్‌టైల్ పార్కును కేంద్రప్రభుత్వం నిర్మించబోతోంది. ఇదిలావుంటే.. ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని యోచిస్తోంది బీజేపీ తెలంగాణ నాయకత్వం. ప్రధాని మోడీ పర్యటనకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. తెలంగాణ బీజేపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి.. ఈ నెలలోనే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా.. విదేశీ పర్యటనలు, ఇతర కారణాలతో షెడ్యూల్ కుదరలేదు. దాంతో వచ్చే నెల 8న ప్రధాని తెలంగాణాకు రానున్నారు. ఇక.. కొద్దిరోజుల క్రితం మధ్యప్రదేశ్ టూర్‌లో మోదీ.. సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై నేరుగానే కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో.. వరంగల్ సభలో మోదీ ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా.. మోదీ తెలంగాణ టూర్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..