Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ ట్విస్ట్‌లు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రభాకర్ రావు విచారణ తరువాత ఈ కేసు విచారణలో వేగం పెరిగింది. ట్యాపింగ్‌కు బలైంది తామేనని కాంగ్రెస్ చెబుతుంటే.. వాళ్ల కంటే ఎక్కువగా తమ ఫోన్లనే ట్యాప్ చేశారని అంటోంది బీజేపీ..

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ ట్విస్ట్‌లు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Bandi Sanjay

Updated on: Jun 22, 2025 | 8:52 AM

బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంటోంది. అమెరికా నుంచి ప్రభాకర్ రావు రాక తరువాత ఈ కేసు విచారణలో సిట్ మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఓ వైపు కేసులో అధికారుల పాత్ర ఏ మేరకు ఉందనే అంశంపై ఆరా తీస్తూనే.. అప్పట్లో ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైన వారి నుంచి వాంగ్మూలాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్‌ గౌడ్ కూడా సిట్ విచారణకు సాక్షిగా హాజరై వాంగ్మూలం అందించారు. బీఆర్ఎస్ హయాంలో వందల సంఖ్యలో కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగా తాము రాజకీయంగానూ నష్టపోయాయని.. గెలవాల్సిన కొన్ని సీట్లలో ఓడిపోయామన్నారు.

మేం కూడా ఫోన్ ట్యాపింగ్‌ బాధితులమే

మరోవైపు ఫోన్ ట్యాపింగ్‌కు తాము కూడా బాధితులమే అంటోంది బీజేపీ. బీజేపీ ఆఫీస్‌ సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

బీజేపీ నేతల ఫోన్లనే ఎక్కువగా ట్యాప్ చేశారు: బండి సంజయ్

మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఇదే రకమైన వాదన వినిపించారు. కాంగ్రెస్ కంటే బీజేపీ నేతల ఫోన్లనే ఎక్కువగా ట్యాపింగ్ చేశారన్నారు. త్వరలోనే సిట్ ముందుకు హాజరై వాంగ్మూలం ఇస్తానన్నారు. కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం తరహాలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు పాలిటిక్స్

అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులమే అని చెబుతుండటంతో.. కేసు విచారణ మరింత వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ వ్యవహారంపై మరింతగా పొలిటికల్ ఫైట్ జరిగే అవకాశం లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తోంది. కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ అలా చేయకపోతే బీఆర్ఎస్‌తో కుమ్మక్కైనట్టే అని ఆరోపిస్తోంది. దీంతో కాళేశ్వరం కేసు తరహాలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా మరింతంగా రాజకీయ రంగు పులుముకోవచ్చనే చర్చ జరుగుతోంది.

ప్రణీత్‌రావుపై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం

ఇదిలా ఉంటే సిట్‌ విచారణకు హాజరైన సస్పెండెడ్‌ డీఎస్పీ ప్రణీత్‌రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్‌రావు స్టేట్‌మెంట్‌ను ప్రణీత్‌రావు ముందుంచారు. అయితే ప్రభాకర్ రావు చెప్పిన ప్రతి పని చేసుకుంటూ వచ్చానని సిట్‌కు తెలిపారు ప్రణీత్ రావు. SIBలో స్పెషల్ ఆపరేషన్ టీం కార్యక్రమాలను ప్రభాకర్‌రావు పూర్తిగా తనకు అప్పగించినట్లు ప్రణీత్‌రావు సిట్ అధికారులకు చెప్పారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..