Suspended DSP Praneeth Rao
మిస్టర్ ప్రణీత్ రావు….కడక్ ఖాకీ డ్రెస్. వారం క్రితం వరకు డీఎస్పీ హోదా. ఇప్పుడు క్రిమినల్ మరకతో చంచల్‌గూడ కటకటాల్లో ప్రణీత్‌రావు. ఫోన్ ట్యాపింగ్, రికార్డుల ధ్వంసం కేసులో నాంపల్లి కోర్టు ప్రణీత్‌రావుకు 14 రోజుల రిమాండ్ విధించింది.
పోలీసై ఉండి క్రిమినల్ పనులా? సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ పోన్ ట్యాపింగ్ వ్యవహారం పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఫస్ట్ టైమ్ ఓ పోలీస్ అధికారిపై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదయింది. ప్రణీత్‌రావు కథ కటకటాలకు చేరింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింకుల డొంక కదులుతోంది. ఎవరి కోసం? ఎవరి ఆదేశాలతో?.. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ నడిచింది?. నిజాల నిగ్గు తేలాలంటే ప్రణీత్‌ను మరింత ప్రశ్నించాలి. అందుకోసం కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు.
ఎన్నికల టైమ్‌లో ప్రత్యేక టూల్ తో ప్రతిపక్ష నేతలు సహా పలువురి ఫోన్లను ట్యాప్ చేశారనే అభియోగంతో కేసు నమోదయింది. దుగ్యాల ప్రణీత్ కథ కటకటాలకు చేరింది. ఐతే ఈ కేసులో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. మరింత లోతుగా ఎంక్వయిరీ చేసేందుకు ప్రణీత్‌రావును కస్టడీకి ఇవ్వాలనికోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ప్రాథమిక విచారణలో సంచలనాలు తెరపైకి వచ్చాయి.
ప్రణీత్ రావు అరెస్టుపై డీసీపీ విజయ్ కుమార్ స్పందించారు. విచారణలో ప్రణీత్‌రావు నేరం అంగీకరించారని తెలిపారు. ప్రణీత్‌రావు పాటు మరికొందరు కలిసి ఎస్ఐబి ఆఫీసులో ఉన్న డేటా ధ్వంసం చేశారని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రహస్యంగా పలువురు ప్రముఖుల ప్రొఫైల్స్‌ను మానిటర్ చేశారని తెలిపారు డీసీపీ. ప్రణీత్‌రావుతో పాటు మరికొందరు కుట్రపూరితంగా వ్యవహరించారని.. కొంతమందితో కలిసి రికార్డ్స్ లో ఉన్న డేటాను తన పర్సనల్ డ్రైవ్‌లో కాపీ చేసుకున్నారని చెప్పారు. తర్వాత కార్యాలయంలో ఉన్న కంప్యూటర్‌లతో పాటు ఎస్‌ఐబిలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. తనతోపాటు మరికొందరి లబ్ది కోసమే ప్రణీత్ డేటా ధ్వంసం చేశాడని వెల్లడించారు డీసీపీ. ప్రణీత్ స్టేట్‌మెంట్ ద్వారా రిటైర్డ్ ఆఫీసర్‌ని విచారించబోతున్నారు పోలీసులు.
ప్రతిపక్ష నేతలు పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు ప్రణీత్ అండ్ టీమ్ ప్రత్యేక టూల్స్‌ను వాడినట్టు గుర్తించారు పోలీసులు. కొందరి ఆదేశాలతో రికార్డులు ద్వంసం చేశారని, కాల్‌డేటాను సాఫ్ట్ కాపీలో సేవ్ చేసి గత ప్రభుత్వ పెద్దలకు రికార్దులు ఇచ్చారని గుర్తించినట్టు సమాచారం. ఇక హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ ధ్వంసం చేసినట్టు నిర్దారించారు పోలీసులు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారని తేల్చడానికి ప్రణీత్ కాల్‌డేటాపై ఫోకస్ పెట్టారు పోలీసులు.
ఎన్నికల సమయంలో నగదు లావాదేవీలకు సంబంధించి ప్రణీత్ కీలక పాత్ర పోషించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా పట్టుబడిన ప్రతిపక్షాల డబ్బు కు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ మొత్తం కూడా ప్రణీత్రావు సేవ్ చేసినట్టు సమాచారం. ఎన్నికల టైమ్‌లో పార్టీలకు ఫండింగ్ ఇచ్చిన రియల్టర్ల కాల్స్‌ను కూడా ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్టు తేలింది. పొలిటికల్ లీడర్లు..రియల్టర్లు.. సహా పోలీస్ ఉన్నతాధికారుల కాల్స్‌ను కూడా ట్యాపింగ్ చేసిన ప్రణీత్..ఆ రికార్డ్స్ అన్నింటిని ధ్వంసంచేశారని తెలుస్తోంది.
ఎవరి కోసం..ఎవరి ఆదేశాలతో ప్రణీత్ అండ్ కో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు? అనే పాయింట్‌పై వైడ్ యాంగిల్‌లో ఎంక్వయిరీ కొనసాగుతోంది. ప్రణీత్ వెనకాల ఉండి కథ నడిపించిన అధికారుల పాత్ర పైన కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు . పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎప్పుడు లేని విధంగా మొదటిసారిగా డీఎస్పీ స్థాయి అధికారిపై టెలిగ్రాఫ్ యాక్ట్ కేసు ఫైల్ చేశారు.ఇప్పటికే పక్కా సమాచారం సేకరించిన పోలీసులు. పక్కా ఆధారాల కోసం అన్వేషిష్తున్నట్టు తెలుస్తోంది. ప్రణీత్ రావు అరెస్టుతో అలర్ట్ అయిన పలువురు మాజీ అధికారులు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. ప్రణీత్‌రావు టీం లో ఉన్న 30 మంది సభ్యులను ఇప్పటికే ప్రత్యేక బృందం గుర్తించింది.