Nizamabad: నిజామాబాద్‌లో మెడికో శ్వేత (Medico Swetha) హఠాన్మరణంతో కన్నవాళ్లు గుండెలు బాదుకున్నారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. శ్వేత స్నేహితులు కూడా కన్నీటిసంద్రంలో మునిగిపోయారు. నిన్నటిదాకా తమ మధ్య ఉన్న శ్వేత ఇప్పుడు విగతజీవిగా పడి ఉండటం చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. చదువుల తల్లి.. ర్యాంకర్.. టాపర్ అయిన తన బిడ్డ ఇకలేదంటూ కన్నతల్లి కుప్పకూలిపోయింది. కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
శ్వేతకు గతంలో రెండుసార్లు కోవిడ్ సోకింది. పోస్ట్ కొవిడ్ సమస్యలే ఆమె మరణానికి కారణమని డాక్టర్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ వెళ్లి శ్వేత డెడ్‌బాడీని పరిశీలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ మరణం వెనుక కారణాలు చెప్పలేమన్నారు డీసీపీ వినీత్.
పీజీ సెకండియర్ చదువుతున్న శ్వేత.. రాత్రి అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆమె పక్కనున్న విద్యార్థులు తట్టిలేపే లోపే ప్రాణాలు కోల్పోయింది. 2 గంటల వరకూ గైనిక్ వార్డులో పని చేసిన శ్వేత.. డ్యూటీ ముగించుకొని విశ్రాంతి గదికి వెళ్లింది. ఆ కొద్ది సేపటికే కింద పడిపోయింది. సైలెంట్ హార్ట్ ఎటాకేనని డాక్టర్లు అనుమానిస్తున్నారు. తమ కూతురు ఎందుకు చనిపోయిందో తెలీక ఆ తల్లిదండ్రులు విలవిల లాడి పోతున్నారు. శ్వేత మృతికి కారణం ఏంటో చెప్పాలని అధికారులను కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..