
కొండగట్టులో వెలసిన శ్రీ ఆంజనేయస్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలవేల్పుగా భక్తితో కొలుస్తారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆయప కొండగట్టు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు, అర్చకులు కోరగా.. టి.టి.డి. సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వాటి నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు.
అనంతరం పవన్ ఇదే విషయాన్ని టి.టి.డి. ఛైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడుతో చర్చించారు. దీంతో కొండగల్లు ఆలయ అభివృద్దికి టి.టి.డి. బోర్డు రూ.35.19 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు.
జనసేన కార్యకర్తలతో సమావేశం
ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ సమావేశం అవుతారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.