
దానాల్లోకెల్లా గొప్ప దానం అవయవదానం అని అంటుంటారు. ఎందుకంటే ఎవరైన చనిపోయాక వారి అవయవాలు దానం చేస్తే మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్లవుతారు. వాళ్లకి మళ్లీ పునర్జన్మను ఇచ్చిన వాళ్లవుతారు. అందుకోసమే కొంతమంది తాము చనిపోయిన అనంతరం తమ అవయవ దానం చేసేందుకు ముందుకు వస్తారు. ఇందుకు కోసం పలు ట్రస్టులతో ఒప్పందం కూడా చేసుకుంటారు. అలాగే మరికొందరు కూడా తమ కుటుంబీకుల్లో ఎవరైన మరణిస్తే అవయవ దానం చేస్తారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఓ యువకుడు మరణించడంతో తన కుటుంబీకులు అతని ఆర్గాన్స్ దానం చేసి గొప్ప మనుసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా నిజాంపేట మండలం కే వెంకటాపూర్ గ్రామానికి చెందిన సింగారం రాకేష్ (19) డిగ్రీ రెండవ ఏడాది చదువుతున్నాడు.
అయితే ఈనెల 7న కామారెడ్డి జిల్లా బస్వాపూర్ సమీపంలో కారు బైకు ఢీకొన్న ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడ్ని హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే రాకేశ్ మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అయినప్పటికీ తన కుమారుడి మరణం మరో నలుగురికి వ్యక్తలకు ప్రాణదానం కావాలనే ఆలోచనతో అతని అవయవాలు దానం చేసేందుకు తన తల్లిదండ్రులు మంజుల, రాజు ముందుకు వచ్చారు. తమ కుమారుడి అవయవాలను జీవన్ దాన్ ట్రస్టుకు దానం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.
( రిపోర్టర్: శివతేజ, మెదక్ జిల్లా )
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..