
కోడి పందాలు ఆడిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఆడించిన వాళ్ళు బాగానే ఉన్నారు. మూగ జీవాలైన మాలో మాకు కత్తులు కట్టి పందెం వేస్తారు. ఇంతవరకు బాగానే ఉంది…కానీ…పొరబాటున పోలీసులకు చిక్కితే పందెం రాయుళ్లు పై కేసులు పెట్టి పోలీసులు కోర్టు కు రిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలో పందెం రాయుళ్లు కొన్ని కొన్ని సందర్బాలలో పోలీసులకు చిక్కకుండా పారిపోతారు. అలాంటి సందర్భంలో పందెం పుంజులు పోలీసుల చేతికి చిక్కి.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. తినటానికి మేత ఉండదు. తాగటానికి నీళ్ళు ఉండవు. పోనీ బయటకు వెళ్లి మేత తిందామనుకుంటే కాళ్ళకు తాడు కట్టి ఉంచుతారు.
మనుషులకు ఏదైనా అన్యాయం జరిగితే హ్యుమన్ రైట్స్ కమిషన్ ( మానవ హక్కుల కమిషన్) ను కలిసి తమ గోడు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ మూగ జీవాలైన కోడి పుంజులు కోడి పందాల స్థావరాల వద్ద పోలీసులకు పట్టుబడి.. పోలీస్ స్టేషన్ , కోర్టు మెట్లు ఎక్కాలి వస్తుంది. మాకు నోరు లేదు కాబట్టే కదా..! మాకు కూడా మానవ హక్కుల కమిషన్ మాదిరి ఉంటే.. మేము కూడా మా గొంతుక వినిపించు కునే అవకాశం ఉండేది. ఏం చేస్తాం… మా గోడు పట్టించు కునే వాళ్ళు కూడా ఉంటే బావుండు అంటున్నట్లు ఉంది ఒక పందెం పుంజు పరిస్థితి.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో గత వారం రోజులు క్రితం కోడి పందాలు నిర్వహిస్తున్నారని సమాచారం తెలిసి పోలీసులు రైడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఒక కోడి పుంజు ను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ ఆవరణలో కట్టేసి ఉంచారు. పట్టుబడిన వారి పై కేసులు నమోదు చేయాలి అంటే కోడి పుంజు ను కూడా కోర్టు కు రిమాండ్ చేయాల్సి ఉంటుంది. అలా కోర్టుకు రిమాండ్ చేశాక కోర్టు ఆదేశాల మేరకు కోడి పుంజును వేలం పాట వేసి అమ్మేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ.. మూగ జీవాలను కూడా పోలీస్ స్టేషన్ లో.. ఖైదీలు మాదిరి కట్టేసి ఉంచుతున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పోలీసులు కోడి పుంజు ను అలా కట్టేసి ఉంచారు. పాపం విముక్తి ఎపుడో మరి.