
యునెస్కో గుర్తింపుతో ప్రపంచ పర్యాటక ముఖచిత్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రామప్ప ఆలయం పక్కనే ఉన్న అతి పురాతన శైవక్షేత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. పాలంపేటలోని శివాలయానికి 1958 నాటి పురాతన కట్టడాలు, పురాతత్వ ప్రదేశాల చట్ట ప్రకారం జాతీయ సంపదగా ప్రకటించింది. ఆ శివాలయానికి జాతీయ వారసత్వ సంపద హోదా కల్పిస్తూ కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆలయం అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందించిన పురావస్తుశాఖ, ఆ ఆలయానికి హద్దులు నిర్ణయించి తమ ఆధీనంలోకి తీసుకుంది.
ఈ శివాలయం ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయం పక్కనే ఉంటుంది. సర్వే నెంబర్ 382/1/2 లో ఉన్న ఈ ఆలయానికి ఎలాంటి ఆదరణ లేక శిధిలావస్థకు చేరుకున్న ఈ ఆలయంపై ఎట్టకేలకు పురావస్తు శాఖ కన్ను పడింది. దీంతో ఆలయం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ ఆలయానికి జాతీయ హోదా కల్పించి అభివృద్ధి చేసేందుకు గత కొంతకాలంగా కేంద్ర పురావస్తు శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పురావస్తుశాఖ అధికారులు 2026 ఫిబ్రవరి 16వ తేదీన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజల నుండి అభ్యంతరాల స్వీకరణకు రెండు నెలల గడువు ఇచ్చారు. ప్రతిపాదనలపై ప్రజల నుండి ఎలాంటి ఆక్షేపణలు, అభ్యంతరాలు రాకపోవడంతో కేంద్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ జనరల్ యదుబీర్ సింగ్ రావత్ ఆదేశాల మేరకు తుది గెజిట్ అధికారికంగా విడుదల చేశారు. ఆలయం చుట్టూ 382/1/2, 382/1 సర్వే నంబర్లలో గల 0.275 ఎకరాల భూమిని పురావస్తుశాఖ రక్షిత ప్రాంతంగా ఆధీనంలోకి తీసుకోనున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు, తవ్వకాలకు అనుమతులు ఉండవని పురావస్తుశాఖ అధికారులు ప్రకటించారు.
జాతీయ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయం పునరుద్ధరణ, అభివృద్ధి, భద్రతా బాధ్యతలను ఇకపై ఏ.ఎస్.ఐ స్వయంగా పర్యవేక్షించబోతుంది. రామప్ప సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇకపై ఈ శైవక్షేత్రం కనువిందు చేయబోతుంది.. ఈ ప్రాంతాన్ని మరింత ఆహ్లాదం, ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యటన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి