Dalit and Tribal Dandora – Revanth Reddy : ఆగస్టు 9 న ఇంద్రవెళ్లి గడ్డమీద లక్ష మందితో దండు కట్టి దళిత, గిరిజన దండోరా మోగిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎక్కడ ఉప ఎన్నికలుంటే అక్కడే పథకాలు తెస్తారా..? అని ప్రశ్నించిన రేవంత్.. 118 నియోజక వర్గాల్లో ఉన్న దళితుల పరిస్థితి ఏంటని నిలదీశారు. కోటి ముప్పై ఐదు లక్షల మంది దళిత, గిరిజనులకు కూడా దళిత బంధు ఇవ్వాలని ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.
“దళితులను మోసం చేసి ఓట్లు డబ్బాల్లో వేసుకుంటాం అంటే చూస్తూ ఊరుకోము.. ఆగస్ట్ 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు దళిత గిరిజన దండోరా మోగిస్తాం. ఆగస్టు 9 న ఇంద్రవెళ్లి గడ్డమీద లక్ష మందితో దండు కట్టి దండోరా మోగిస్తాం.” అని ఆయన చెప్పారు. “నాకు ప్రేమ్ సాగర్ రావు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తా.” అని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.
ఏపీలో కాంగ్రెస్‌ను చంపుకుని సోనియా తెలంగాణ ఇచ్చిందన్న రేవంత్ రెడ్డి.. రాజకీయ ప్రయోజనాల కోసం సోనియా తెలంగాణ ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడం లేదని చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి.. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే, దివాళా తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రతీ మనిషిమీద లక్ష రూపాయల అప్పు తెచ్చారని, ఉప ఎన్నికలొస్తేనే కేసీఆర్ కు పథకాలు గుర్తుకొస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Read also : Chandrababu letter : రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా బాబు లేఖ, తెరపైకి ఎంపీల రాజీనామాలు.. ఓపెన్ ఛాలెంజ్‌లు..!