Godavari : ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి నది ఉగ్రరూపం.. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ప్రమాద స్థాయికి నీటిమట్టం
ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకుంది. దీంతో మొదటి హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు...
Dhavaleswaram barrage reaches dangerous level : ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకుంది. దీంతో మొదటి హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 10.4 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9,41,146 క్యూసెక్కులుగా ఉంది.
అత్యవసర సహాయక చర్యల కోసం రెండు NDRF, మూడు SDRF బృందాలను సిద్ధంగా ఉంచారు. తూర్పుగోదావరి జిల్లా కూనవరం, చింతూరు, విఆర్ పురం. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కెఆర్ పురంలో బృందాలు రెడీగా ఉన్నాయి. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు.
అటు, కోనసీమలో గోదావరి ఉప నదులు పొంగిపొర్లుతున్నాయి. వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదులకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. దాంతో కోనసీమ ప్రాంతాన్ని గోదావరి ముంచెత్తింది. పి.గన్నవరం మండలం ఊడిముడి లంక నదీపాయకు అడ్డుకట్ట తెగిపోవడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ఉధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో కోనసీమలోని పలు లంకగ్రామాలకు ముప్పు పొంచి ఉంది. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. కోనసీమలోని అధికారులకు సెలవులు రద్దు చేసింది. లంక గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఉధృతి కారణంగా కొబ్బరి చెట్లు నేలకొరుగుతున్నాయి. జిల్లాలోని మామిడికుదురు మండలం అప్పనపల్లి నదీ తీర ప్రాంతంలో గోదావరి వరద ఉధృతి కారణంగా పచ్చని కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. నదీ కోత కారణంగా 9 కొబ్బరి చెట్లు వరద నీటిలో పడిపోయాయి.
మరోవైపు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పిల్లల కాలువలు, ఉపనదులకు వరద పోటెత్తుతుండటం.. ఆ ప్రవాహం గోదావరిలో కలుస్తుండటంతో నది ప్రవాహం ఉధృతంగా మారింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అమాంతం పెరిగింది. భద్రాచలం వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 46.7 అడుగులుగా ఉంది. 48 అడుగులకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
వరద ఉధృతి అధికంగా ఉండటంతో.. రామాలయం ఎదురుగా ఉన్న స్లూయిజ్ లీక్ కావడంతో అన్నదాన సత్రం వద్దకు గోదావరి వరద నీరు చేరుతోంది. రాములవారి పడమటి గుడిమెట్ల ముందు ఉన్న ఇళ్లు, బొమ్మ కొట్టలోకి గోదావరి వరద నీరు చేరింది. గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతుండటంతో.. అధికారులు అలర్ట్ అయ్యారు. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సత్రంలోకి, ఇళ్ల వద్దకు వచ్చిన గోదావరి వరద నీటిని మోటార్ల ద్వారా గోదావరి నదిలోకి పంపింగ్ చేస్తున్నారు అధికారులు.
Read also : Alla Ramakrishna Reddy : సీఎం జగన్ కు థ్యాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే ఆర్కే.. చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్య