
రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఓ వైపు టికెట్ల పంచాయతీ జోరుగా నడుస్తోంది. అసమ్మతి, అసంతృప్తి పేరుతో కొన్ని పార్టీలు అట్టుడుకుతున్నాయి. తన కంటే తనకు టికెట్ అంటూ రచ్చ రచ్చ నడుస్తోంది. కానీ ఆ నియోజకర్గంలో పరిస్థితులు మాత్రం పూర్తిగా రివర్స్. ఒక్క కాంగ్రెస్ మినహా మిగతా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా స్థానికేతరులే. అంతెందుకు ఐదు దశాబ్దాలుగా అక్కడ స్థానికేతరులదే రాజ్యం. ఏంటి ఆ నియోజకవర్గం.. ఎవరక్కడ ఎమ్మెల్యేలో తెలుసుకుందాం.
అచ్చంపేట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 1967లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ గా ప్రకటించబడింది. నాటి నుంచి నేటి వరకు కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలే ఈ నియెజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఎక్కువ శాతం స్థానికేతరులే కావడం విశేషం. వారే ఉమ్మడి రాష్ర్టంలో మంత్రులు సైతం అయ్యారు. ఒక్కసారి మినహా 5దశాబ్ధాలుగా ఇతర నియోజకవర్గాల వ్యక్తులదే అచ్చంపేటలో ఆధిపత్యం. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన స్థానికేతరులకు మంత్రులుగా సేవలందించే అవకాశం కల్పించింది ఆ నియెజకవర్గం. తెలంగాణ రాష్ర్టంలో మారుమూలన ఉన్న నల్లమల అడవుల కలిగిన అచ్చంపేట నియోజకవర్గం స్థానికేతరులనే అక్కున చేర్చుకుంది. సుమారు 56ఏళ్లలో ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి స్థానిక వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
నాలుగు సార్లు(1967,1972,1983,1985) ఎమ్మెల్యేగా గెలిచిన మహేంద్రనాథ్ కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జొన్నలబోగుడ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇక మూడు పర్యాయాలు(1994,1999,2009) ఎన్నికైన పొతుగంటి రాములు సైతం కల్వకుర్తి నియోజకవర్గం గుండూరు స్వస్థలం. ఒక్కోమారు గెలిచిన ఆర్ ఎం మనోహర్(1978) స్వస్థలం హైదరబాద్ కాగా డి. కిరణ్ కుమార్ (1989) గోపాల్ పేట మండలం వాసి. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(2014,2018)ది వనపర్తి నియోజకవర్గం పొలికెపాడు గ్రామం. ఒక్క 2004 పర్యాయం మాత్రం డా, వంశీ కృష్ణ అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఎల్కపల్లి వాసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో దాదాపు 80శాతం ప్రజలు జీవనాధరం వ్యవసాయం. ఎలాంటి పరిశ్రమలు లేవు, అడవి విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతం. నల్లమలలో దట్టమైన అడవులు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంతో సరిహద్దు పంచుకుంటున్న కీలక నియోజకవర్గం అచ్చంపేట. ఇక అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు స్థానిక నేతలు పెద్దగా అసక్తి కనబరచడం లేదు. ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఆ సామాజిక వర్గంలో అర్థికంగా బలమైన నాయకులు లేకపోవడం ఒక కారణంగా కనిపిస్తోంది. దీంతో పాటు రాజకీయాలపై ప్రజలకు సైతం అంత అంత మాత్రమే అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానికేతరులకు అవకాశాలు ఏర్పడుతున్నాయి.
ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆరుసార్లు గెలిస్తే… టీడీపీ ఐదు సార్లు విజయం సాధించింది. ఇక గడిచిన రెండు పర్యాయాలు మాత్రం బీఆర్ఎస్ పాగా వేసింది. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా స్థానికేతరుడు గువ్వల బాలరాజు, కాంగ్రెస్ నుంచి స్థానికుడు వంశీకృష్ణ బరిలో నిలిచారు. ఈ దఫా అచ్చంపేట ఓటర్లు ఎవరికి పట్టం కడతారో, తీర్పు ఎలా ఉండబోతోంది వేచిచూడాల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..