
విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న వేళ కొన్ని గ్రామపంచాయతీలు వినూత్న నిర్ణయాలతో చర్చనీయంగా మారుతున్నాయి. వరంగల్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడిలో చదివే ఆ ఊరి విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామపంచాయతీ పన్నుల నుంచి మినహాయింపు ఇస్తూ తీర్మానం చేయడం తీవ్ర చర్చగా మారింది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గం ఈ తరహా వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తూ, గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా మైసంపల్లి గ్రామపంచాయతీ ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని గ్రామ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కుటుంబాలకు ఇంటి పన్ను, నల్లా పన్నుల నుంచి పూర్తి మినహాయింపు కల్పిస్తామని గ్రామ సర్పంచ్ ఇంద్రదేవ్ ప్రకటించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోనూ అలాంటి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో సర్కారు బడిని కాపాడుకోవాలనే సంకల్పంతో గ్రామస్థుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
గ్రామ పాలకవర్గం ఏకాభిప్రాయంతో తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామాభివృద్ధికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్లు సర్పంచ్ తెలిపారు
స్పాట్
గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, వారి విద్యా బాధ్యతలను గ్రామపంచాయతీ చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విద్యాభివృద్ధికి, గ్రామాభివృద్ధికి మైసంపల్లి చూపిన ఈ మార్గం ఇతర గ్రామాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతు న్నారు.
ప్రజలకు వివరిస్తున్న సర్పంచ్ వీడియో..