
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూరోసర్జరీ విభాగం వైద్యులు వైద్య రంగంలో మరో సరికొత్త మైలురాయిని అధిగమించారు. అత్యాధునిక శస్త్రచికిత్స విధానమైన ఎండోస్కోపిక్ ట్రాన్స్‌ఆర్బిటల్ అప్రోచ్ పద్ధతిని ఉపయోగించి, తలపై ఎలాంటి పెద్ద గాయం లేకుండా ఒక మహిళ మెదడులోని కణితిని విజయవంతంగా తొలగించారు. కంటి గవ్వ సహజ మార్గాన్ని ఉపయోగించి ఈ అరుదైన ఆపరేషన్ చేయడం విశేషం. మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం మధుర్ గ్రామానికి చెందిన మంగలి లత అనే మహిళ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిని ఆశ్రయించారు. వైద్యులు ఆమెకు పలు పరీక్షలు నిర్వహించగా, కంటి వెనుక భాగంలోని పుర్రె అడుగు ప్రాంతంలో మెదడు కణితి ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కణితులను తొలగించాలంటే తల ఎముకను పూర్తిగా తెరిచే క్రానియోటమీ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ రోగి వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తక్కువ నొప్పితో వేగంగా కోలుకునేలా నిమ్స్ వైద్యులు అత్యాధునిక ఈ టోవా పద్ధతిని ఎంచుకున్నారు.
ఈ విప్లవాత్మక శస్త్రచికిత్సలో కనుబొమ్మ సహజ మడత వద్ద ఒక చిన్న కోత మాత్రమే పెట్టారు. అక్కడ నుండి హై-డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో కంటి గవ్వ గుండా మెదడులోని కణితి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ఆపరేషన్‌లో అత్యంత ఆధునికమైన 3D న్యూరోనావిగేషన్ వ్యవస్థ, CUSA (కావిట్రాన్ అల్ట్రాసోనిక్ సర్జికల్ ఆస్పిరేటర్) సాంకేతికతలను ఉపయోగించారు. దీనివల్ల చుట్టుపక్కల ఉండే మెదడు కణజాలానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో కణితిని పూర్తిగా తొలగించారు.
న్యూరోసర్జరీ విభాగ అదనపు ప్రొఫెసర్ డా.యర్రగుంట తిరుమల్ మాట్లాడుతూ.. మెదడు కణితుల చికిత్సలో ఎండోస్కోపిక్ ట్రాన్స్‌ఆర్బిటల్ అప్రోచ్ ఒక విప్లవాత్మక మార్పు అని పేర్కొన్నారు. ఈ పద్ధతి వల్ల తల ఎముకను పెద్ద ఎత్తున కోయాల్సిన అవసరం ఉండదని.. సర్జరీ జరిగినట్లు బయటకు కనిపించే ఎలాంటి మచ్చలు కనిపించవని చెప్పారు. రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల ప్రమాదం చాలా వరకు తగ్గడంతో పాటు రోగి చాలా త్వరగా కోలుకుని తన రోజువారీ పనులు చేసుకోవచ్చన్నారు.
నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప గారు మాట్లాడుతూ.. శస్త్రచికిత్స విజయవంతమైందని, రోగి ఎలాంటి న్యూరోలాజికల్ సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని ప్రకటించారు. ప్రైవేట్ లేదా కార్పొరేట్ ఆసుపత్రులలో ఈ తరహా చికిత్సకు సుమారు రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని, కానీ నిమ్స్‌లో తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి పథకాల కింద ఈ ఆపరేషన్‌ను రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా నిర్వహించామని తెలిపారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేసిన న్యూరోసర్జరీ బృందం హెచ్.ఓ.డి డా. వై. వంశీకృష్ణ, డా. యర్రగుంట తిరుమల్, డా. రామ్‌నాథ్ రెడ్డి, డా. మురళీకృష్ణ, డా. ఉమా మహేశ్వర్ మరియు అనస్థీషియా బృందాన్ని డైరెక్టర్ అభినందించారు. అలాగే ఉచిత చికిత్సకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఏటా 3,500కు పైగా మెదడు, వెన్నెముక సర్జరీలు చేస్తూ నిమ్స్ దేశంలోనే అగ్రగామి ప్రభుత్వ వైద్య సంస్థగా నిలిచింది.