
భూముల రిజిస్ట్రేషన్‌లో ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో ఉన్న ధరణి స్థానంలో నేటి భూ భారతి చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే 4 మండలాల్లో భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. నేటి నుంచి ఈ నెల 20 వరకు ప్రజల దగ్గరకే రెవెన్యూ వ్యవస్థ కదిలి వెళుతుంది. ప్రతి గ్రామంలో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు అధికారులు. ఆగస్టు 15 నాటికి ఆ సమస్యలను ఉచితంగానే పరిష్కరిస్తారు. దీని కోసం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ట్రైనింగ్ ఇచ్చిన సర్వేయర్లతో సర్వే నిర్వహిస్తారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభమయింది. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని నేతలు..భూములు ఆక్రమించుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు భూతగాదాలు కూడా పెరిగిపోయాయని.. వాటికి సంబంధించిన వివాదాలు గుట్టుగుట్టలుగా పెండింగ్‌లో పడ్డాయంటూ విమర్శలు వచ్చాయి. అలాగే ధరణి పోర్టల్ నిర్వాహణను ప్రైవేటు సంస్థకు ఇవ్వటం వల్ల.. ప్రజలకు సంబంధించిన సమాచారానికి గోప్యత లేకుండా పోయిందని.. దీని వల్ల చాలా అక్రమాలకు ధరణి పోర్టల్ కారణమైందంటూ ఆరోణపలు వెల్లువెత్తాయి.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అజెండాగా మారింది ధరణి పోర్టల్. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతామంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ నిర్వాహణను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పోర్టల్‌లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది.
ఇక ధరణి పోర్టల్‌కి భూభారతి పోర్టల్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంతా తేడా ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భూ భారతితో రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా నడుస్తున్నామన్నారు. జూన్ 20 తేదీ వరకు రెవెన్యూ వ్యవస్థే గ్రామాలకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భూభారతిని తీసుకువచ్చామన్న పొంగులేటి వచ్చే ఎన్నికల్లో భూభారతి చట్ట తమ ప్రభుత్వానికి రెఫరెండమని స్పష్టం చేశారు.
భూభారతి అమలులో భాగంగా ఈ నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది ప్రభుత్వం. తహసీల్దార్‌తో కూడిన బృందం గ్రామాల్లోకి వెళ్లి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించి, పరిష్కరిస్తుంది. పైలట్ ప్రాజెక్ట్ చేపట్టిన మండలాల్లో 55 వేల దరఖాస్తులు వస్తే.. అందులో 60శాతానికి పైగా పరిష్కరించామని చెప్తోంది ప్రభుత్వం. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతోపాటు సర్వే మ్యాపును జతపరుస్తోంది. రెండు, మూడు నెలల్ల 6వేల మంది సర్వేయర్లను నియమించి.. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామంటోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..