నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందడి.. అభ్యర్థి ఎంపికపై ప్రధాన పార్టీల కసరత్తు.. ఒకటి, రెండురోజుల్లో ప్రకటించే ఛాన్స్!

| Edited By: Team Veegam

Mar 24, 2021 | 11:58 AM

Nagarjuna Sagar By Election 2021: సాగర్‌ ఉపఎన్నికకు అభ్యర్థి ఎంపికపై ప్రధాన పార్టీలు దృష్టి సారించారు. నామినేషన్ల దాఖలుకు వారం రోజుల గడువే ఉండటంతో అభ్యర్థిని త్వరగా ప్రకటించాలని యోచిస్తున్నారు.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందడి.. అభ్యర్థి ఎంపికపై ప్రధాన పార్టీల కసరత్తు.. ఒకటి, రెండురోజుల్లో ప్రకటించే ఛాన్స్!
Sagar Bypoll Crucial For 3 Main Telangana Parties
Follow us on

Nagarjuna Sagar By poll 2021: నాగార్జునసాగర్‌ శాసనసభ ఉపఎన్నికకు అభ్యర్థి ఎంపికపై ప్రధాన పార్టీలు దృష్టి సారించారు. నామినేషన్ల దాఖలుకు వారం రోజుల గడువే ఉండటంతో అభ్యర్థిని త్వరగా ప్రకటించాలని యోచిస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. సాగర్ సమరంలో సత్తా చాటేందుకు పార్టీలన్నీ స్కెచ్‌లు గీస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఫుల్‌ జోష్‌లో ఉన్న టీఆర్‌ఎస్‌.. సేమ్ సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. సూపర్‌ విక్టరీతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని కమలం దళం ఉవ్విళ్లురుతుంది. ఇక సోయిలో లేకుండా పోయిన కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు మేము సైతం అంటూ స్వతంత్ర అభ్యర్థులు కూడా రేసులోకి దూసుకొస్తున్నారు. దీంతో సాగర్‌ ఫైట్‌ రంజుగా మారింది.

ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మరణంతో అనివార్యమైన నాగార్జున సాగర్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నువ్వా? నేనా? అన్న స్టయిల్‌లో తలపడుతున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ.. సాగర మథనం చేస్తున్నాయి. రెండు పార్టీలూ అభ్యర్థుల ఎంపిక కోసం మల్లగుల్లాలు పడుతున్నా యి. అయితే కాంగ్రెస్‌ మాత్రం ఓ అడుగు ముందుకేసీ తమ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్‌ నేత కె.జానారెడ్డి పేరును ప్రకటించింది. టీడీపీ నుంచి మువ్వా అరుణ్‌కుమార్‌ బరిలో దిగుతున్నారు. తమ పార్టీ అభ్యర్థిని కూడా పోటీలో నిలుపుతున్నట్లు మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రకటించారు. మరోవైపు, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా కాశీ పేరును ఖరారు చేశారు. అయితే అభ్యర్థుల ఎంపికతో సంబంధం లేకుండా అన్ని పార్టీలూ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

నామినేషన్ల పర్వం మొదలుకావడంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థిత్వాలు ఎవరికి దక్కుతాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపిక కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు పట్టభద్ర ఎమ్మెల్సీల గెలుపుతో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమవుతుండగా… అన్ని కోణాల్లో ఆలోచించి బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాలని సీఎం నిర్ణయించారు. దీని కోసం 2నెలలుగా నిర్వహించిన సర్వేనివేదికలను పరిశీలించారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితాల అనంతరం పార్టీ అధిష్ఠానం మరోసారి నమూనా సర్వేను చేయించినట్లు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉండటంతో అభ్యర్థి విషయంలో తొందరపడటంలేదు. కాగా, బీసీనేతే నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి అవుతారని పార్టీ సర్వేలు, పరిశీలకులు, ఇన్‌ఛార్జి ఎమ్మెల్యేలు సీఎంకు సూచించినట్లు తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌ టికెట్‌ రేసులో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌, మన్నె రంజిత్‌ యాదవ్‌, గురువయ్య యాదవ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీళ్లలో ఒకరు అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫైనల్‌గా సర్వే నివేదికను పార్టీ అధిష్ఠానం ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉందంటున్నారు పార్టీ వర్గాలు.

ఇక, భారతీయ జనతా పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో అచీ తూచీ వ్యవహరిస్తోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖరారయ్యాక తమ అభ్యర్థిని నిర్ణయించాలనే వ్యూహంతో ఉంది. డాక్టర్‌ రవికుమార్‌ నాయక్‌, ఇంద్రసేనారెడ్డి, నివేదితారెడ్డి, కడారి అంజయ్యయాదవ్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. స్థానికంగా పార్టీకి పెద్దగా బలం లేదు. అయితే, అభ్యర్థి ప్రకటనతోనే మంచి ఊపు తీసుకురావాలని బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు కలిసొస్తాయని బీజేపీ భావిస్తోంది.

కాంగ్రెస్‌ అందరికంటే ముందే సీనియర్ నేత జానారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. నిజానికి సాగర్‌ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. కానీ, రానురాను ఆ కోటలు బీటలు వారుతూ వచ్చింది. ఇప్పుడెలాగైనా ఈ స్థానంలో కాంగ్రెస్‌ జెండాను ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారు. ఈ ఒక్క గెలుపుతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని కృత నిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే జానారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పల్లె పల్లెన తిరుగుతూ కేడర్‌లో జోష్‌ నింపుతున్నారు.

సాగర్ సమరంలో స్వతంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మొదటిరోజు ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలుకి సమయం ఉండడంతో స్వతంత్రుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఉప సమరంలో సత్తా చాటేందుకు పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటిపడుతున్నారు.

తొలి రోజు అయిదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. వీరిలో హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన రేవు చినధనరాజు, మల్కాజిగిరికి చెందిన లోక్‌గారి రమేశ్‌, దుబ్బాకకు చెందిన గౌటి మల్లేశ్‌, కరీంనగర్‌కు చెందిన సిలివేరు శ్రీకాంత్‌తో పాటు సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్‌గూడెంకు చెందిన బండారు నాగరాజు ఉన్నారు. నిరుద్యోగం, అవినీతి నిర్మూలన, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అయిదుగురం కలియుగ పాండవులుగా ఏర్పడి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చినధనరాజు, మల్లేశ్‌, రమేశ్‌, శ్రీకాంత్‌ తెలిపారు.

Read Also…  Supernumerary Posts : పోలీస్ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టులు.. ఎవరు అర్హులో తెలుసుకోండి..