సంక్షేమ హాస్టల్స్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం… తనిఖీల పేరుతో హాస్టల్స్ బాటపట్టింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా హాస్టల్స్, గురుకులాల్లో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి.. వాళ్లతో కలిసి భోజనాలు చేశారు.
హాస్టల్ విద్యార్థులకు పోషకాహారంతో పాటు, రుచికరమైన భోజనం అందించడంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు అమలవుతున్న డైట్‌లో పలు మార్పులు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా మెనూ సిద్ధం చేసింది. ప్రభుత్వ హాస్టళ్లలో ఇప్పటి వరకు ప్రతి ఆదివారం చికెన్ పెడుతున్నారు. అయితే తొలిసారిగా విద్యార్థులకు మటన్ పెట్టబోతున్నారు. ఇకపై లంచ్‌లో నెలలో రెండు సార్లు మటన్, 4 సార్లు చికెన్ పెట్టనున్నారు. నాన్ వెజ్ భోజనం పెట్టినప్పడు సాంబార్, పెరుగు కూడా ఉంటుంది. నాన్ వెజ్ తినని వారికి ఆ రోజుల్లో మీల్ మేకర్ కర్రీ పెడతారు. నాన్ వెజ్ లేని మిగతా రోజుల్లో లంచ్‌లో ఉడికించిన గుడ్డు లేదా ఫ్రైడ్ ఎగ్ ఇస్తారు.
రంగారెడ్డి జిల్లా చిల్కూర్‌లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి… అక్కడ్నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభించారు. అనంతరం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు
ప్రైవేట్ స్కూళ్లు వచ్చాక కొంతవరకు గురుకులాల ప్రభావం తగ్గిందని సీఎం అన్నారు. గురుకులాల ప్రక్షాళన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లుగా బీఆర్ఎస్ సర్కారు డైట్ ఛార్జీలు పెంచలేదని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక గురుకులాల డైట్ ఛార్జీలు పెంచామన్నారు. విద్యార్థుల మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు… భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి అన్నారు రేవంత్‌రెడ్డి.
కాంగ్రెస్ సర్కార్ హాస్టల్స్ బాటపట్టడంపై బీఆర్‌ఎస్ రియాక్ట్ అయింది. కాంగ్రెస్ సర్కార్‌లో కదలిక రావడానికి తమ పోరాట ఫలితమేనని కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ గురుకుల బాటతో ప్రభుత్వంలో ఎట్టకేలకు చలనం వచ్చిందన్నారు. కేవలం గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు.. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి, ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు- పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి అని ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్టు వంటి శిఖరాలను అధిరోహిస్తే.. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రి బెడ్లను ఎక్కించారని మండిపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..