
మూసీ దగ్గరికి వెళ్లి.. గుండెల నిండా గాలి పీల్చుకుంటూ ఓ ప్రాణయామం చేసి.. కాసేపు ధ్యానం చేసి.. ముఖంపై ఈ మూసీ నీటినే చల్లుకుని తువాలుతో తుడుచుకుని ఇంటికొచ్చేస్తే..! వీకెండ్ ఔటింగ్ ఎక్కడికెళ్దాం అని పిల్లలు అడిగితే.. సరదాగా మూసీలో గడిపి వద్దాం అని పేరెంట్స్ చెప్తే..! జిల్లాల నుంచి స్కూల్ ఎక్స్‌కర్షన్లు, దేశ విదేశాల టూరిస్టులు, డెస్టినేషన్ పాయింట్‌గా మూసీకేసీ చూస్తే..! మూసీ చుట్టుపక్కల బతుకుతున్న వాళ్లు, రోజూ మూసీ మీదుగా ప్రయాణిస్తున్న వాళ్లు ఇది వింటే కాసేపు నవ్వుకోవచ్చు.. ఎగతాళిగా. జరిగే పనేనా అనుకోవచ్చు. ఇప్పటికి ఇదంతా కలే. కాని, ఇలా చేయాలనే అద్భుతమైన ఆలోచనలు కూడా ఉన్నాయ్. ఆలోచన బాగానే ఉంది గానీ.. మూసీ పునరుజ్జీవం పేరుతో చేపడుతున్న ప్రాజెక్టే కాస్త వివాదాల్లో చిక్కుకుంది. పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొడుతూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నదని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. అడుగడుగునా అడ్డుకుంటూ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రతిపక్షాల మెయిన్ అబ్జెక్షన్.. ఈ ప్రాజెక్ట్ వ్యయం, ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టాల్సిన కూల్చివేతలు. తాము ఉన్నప్పుడు.. కేవలం 16వేల 800 కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన పూర్తి చేసేవిధంగా ప్రణాళికలు రచించామన్నది బీఆర్ఎస్ వాదన. అసలు పేదల ఇళ్ల జోలికే వెళ్లకుండా.. కూల్చే పరిస్థితే ఉత్పన్నం కాకుండా.. మొత్తం మూసీనది ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని బీఆర్ఎస్ చెబుతోంది. మూసీ పునరుజ్జీవనానికి అసలు పేదల ఇళ్లే అడ్డంకి కాదన్నది బీఆర్ఎస్...