‘అంతా బాగుంది.. అంతాబాగుంది’ అని అధికార పక్ష సభ్యులు చెప్పుకుంటుంటే ఇక అసెంబ్లీ సమావేశాలు జరుపడమెందకని ములుగు కాంగ్రెస్ శాసనసభ్యురాలు సీతక్క ప్రశ్నించారు. అంతా బాగుంది అని చెప్పుకోవడానికి చాలా వేదికలు ఉంటాయని, కానీ సమస్యల గురించి ప్రస్తావించుకోవడానికి ఉన్న వేదిక అసెంబ్లీయేనని ఆమె అసెంబ్లీలో స్పష్టం చేశారు. అధికార పక్ష సభ్యులు ‘ఆహా, ఓహో..’ అనుకుంటూ తమ సొంత డబ్బాలు కొట్టుకునేందుకు సమయం సరిపోతోందని, ఇతర పార్టీల సభ్యులకు సమయం ఇవ్వడంలేదని సీతక్క మండిపడ్డారు. ఇటీవలే బైకెలి నాగులు (55) అనే టీఆర్ఎస్ కార్యకర్త తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీతక్క అసెంబ్లీలో ప్రస్తావించారు. కళ్లముందు జరిగిన ఘటనపై మంత్రులు, ఇతర టీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించలేదని ఆమె అన్నారు. నాగులు మృతదేహంపై టీఆర్ఎస్ కండువా కప్పారు కానీ, ఒక్క టీఆర్ఎస్ నేత కూడా అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు రాలేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గౌరవించాలని, నాగులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాగులు అంశంలో హోంమంత్రి ఓ ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతుండగా, అధికార పక్ష సభ్యులు అడ్డుతగిలారు. దాంతో సీతక్క అసంతృప్తికి గురయ్యారు. పై విధంగా స్పందించారు. తమకు జీరో అవర్లో కూడా మాట్లాడేందుకు సమయం ఇవ్వడంలేదని.. తమ గొంతు నొక్కితే ఏమొస్తుందని ప్రశ్నించారు.