
పెట్టుబడికి రెండింతలు లాభం.. నెలానెలా పొదుపు చేస్తే కొండంత ఆదాయం.. అంటూ అరచేతిలో వైకుంఠం చూపించి, పేద, మధ్యతరగతి వర్గాలను నిలువునా ముంచేసింది ‘యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్’ సంస్థ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా సాగిన ఈ భారీ కుంభకోణం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి, సంస్థ బోర్డు తిప్పేయడంతో వేలాది మంది బాధితులు లబోదిబోమంటున్నారు.
గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి 1996లో అహ్మదాబాద్ కేంద్రంగా ‘యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్’ అనే సంస్థను ప్రారంభించారు. ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబడులు పెడతామని, వచ్చే లాభాల్లో వాటా ఇస్తామని నమ్మబలికారు. 2013లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టిన ఈ సంస్థ, 2020 నాటికి తన కార్యకలాపాలను పీక్స్‌కు చేర్చింది. 70 నెలల పాటు ప్రీమియం చెల్లిస్తే, అసలుకు అదనంగా 45 శాతం లాభం ఇస్తామని ఆశ చూపడంతో జనం ఎగబడ్డారు.
కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ సంస్థకు సుమారు 3,000 మంది ఏజెంట్లు ఉన్నారంటే మోసం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏజెంట్లకు భారీగా కమిషన్లు ఇవ్వడంతో వారు ఊరూరా తిరిగి పాలసీలు చేయించారు. మొదట్లో కొందరికి డబ్బులు చెల్లించి నమ్మకం కలిగించిన సంస్థ, ఆ తర్వాత అసలు రంగు బయటపెట్టింది. ప్రస్తుతం బాధితుల సంఖ్య ఏజెంట్ల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. “పిల్లల పెళ్లిళ్లు, భవిష్యత్తు అవసరాల కోసం రూపాయి రూపాయి కూడబెట్టి ఇందులో పోశాం. ఇప్పుడు కార్యాలయం మూతపడింది, దిక్కు తోచడం లేదు” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధితుడు తన సొంత ఇల్లు అమ్మి, తన మామగారి రిటైర్మెంట్ సొమ్ముతో కలిపి మొత్తం 84 లక్షల రూపాయలు ఏజెంట్ ద్వారా పెట్టుబడి పెట్టగా, ఇప్పుడు ఒక్క రూపాయి కూడా వెనక్కి రావడం లేదని కన్నీరు మున్నీరవుతున్నారు.
కరోనా సమయంలో లావాదేవీలు ఆగిపోయినట్లు నాటకమాడిన సంస్థ, ఆ తర్వాత ‘లైఫ్ కేర్’ రిసార్ట్ ప్యాకేజీల వంటి కొత్త పేర్లతో కార్యకలాపాలు సాగించింది. బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఇతర సంస్థలకు మళ్లించి, భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇలాగే బోర్డు తిప్పేయడంతో అక్కడి బాధితులు రోడ్డెక్కారు. ఇప్పుడు కరీంనగర్ కార్యాలయం కూడా మూతపడటంతో ఆందోళనలు తీవ్రమయ్యాయి. తమ కష్టార్జితం పోయిందని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పోలీసులు మాత్రం తమకు ఇప్పటివరకు సంస్థపై నేరుగా ఫిర్యాదులు అందలేదని, అక్కడక్కడా ఏజెంట్లపై వ్యక్తిగత కేసులు మాత్రమే నమోదవుతున్నాయని చెబుతున్నారు.
ముఖ్య గమనిక: అధిక లాభాలు వస్తాయని నమ్మించే ఇటువంటి ప్రైవేట్ చిట్ ఫండ్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నమ్మకమైన బ్యాంకులు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లోనే పొదుపు చేసుకోవడం శ్రేయస్కరం..!
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..