Telangana: కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..

కన్నతల్లి ప్రేమ ముందు ఏ త్యాగమైనా చిన్నదే అంటారు.. కానీ ఆ తల్లి మాత్రం రెండు నెలల పసికందును బలితీసుకుంది. కనికరం లేకుండా కన్నబిడ్డను నీటి తొట్టిలో పడేసి ప్రాణాలు తీసింది. పైగా ఆ నేరాన్ని భర్తపైకి నెట్టి పోలీసులనే నమ్మించాలని చూసింది. సీన్ కట్ చేస్తే ఖాకీల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Telangana: కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..
Mother Kills 2 Month Old Baby

Edited By:

Updated on: Mar 04, 2026 | 11:35 AM

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి గ్రామానికి చెందిన ఉల్లంగొండ్ల నీలమ్మకు వనపర్తి జిల్లా పానగల్ మండలం శాగాపురం గ్రామానికి చెందిన గుర్రంకొండ నరేందర్‌కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ, ఒకరు ఆడపిల్ల సంతానం. ఎనిమిదేళ్లు సంసారం సాఫిగానే సాగింది. గడిచిన రెండేళ్ల క్రితం నుంచి భార్య నీలమ్మ, భర్త నరేందర్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య నీలమ్మ పుట్టింట్లోనే ఉంటోంది. అయితే ఈ ఏడాది జనవరి 4న భార్య నీలమ్మ బాబుకు జన్మనిచ్చింది. ఇక ఈనెల 27న మధ్యాహ్నం భర్త నరేందర్ తన తల్లిదండ్రులతో కలిసి వచ్చి నీలమ్మను కాపురానికి పంపాలని చర్చించి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తన సంసారానికి బాబు అడ్డువస్తున్నాడని.. బాబు లేకుంటే తన భర్త తిరిగి తీసుకెళ్తాడని భావించింది. అదే రోజు రాత్రి చిన్నారిని హత్య చేయాలని నిర్ణయించింది.

అందరూ గాఢ నిద్రలో ఉండగా ఘాతుకం

ఇక తెల్లవారు జామున సుమారు 2 గంటలకు కుటుంబ సభ్యులు అంతా గాఢ నిద్రలో ఉన్నారు. తన రెండు నెలల బాబును ఎత్తుకొని శబ్ధం చేయకుండా ఇంటిబయటకు వెళ్లింది. అక్కడే ఉన్న నీటి తొట్టిలో బాబును పడేసి మెల్లిగా ఇంట్లో వచ్చి యథావిధిగా నిద్రకు ఉపక్రమించింది. కాసేపటికి ఏమి ఎరగనట్టు బాబు కనపించడం లేదని కేకలు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇళ్లంతా వెతికారు. నీలమ్మ తల్లి ఇంటి బయటకు వెళ్లి చూడగా నీటితొట్టిలో చిన్నారి మరణించి కనిపించాడు. ఇక తన భర్త నరేందరే చిన్నారిని హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. అంతేకాకుండా పోలీసులకు సైతం తన భర్తే ఘాతుకానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది.

ఇక విషాద ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. భర్త నరేందర్ తో పాటు భార్య నీలమ్మ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా విచారించారు. చివరకు భార్య నీలమ్మను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం చెప్పింది. పసిపాపను తానే కడతేర్చినట్లు కన్నతల్లి నేరాన్ని అంగీకరించింది. పాలబుగ్గల పసివాడికి కన్నపేగే ఊరితాడయిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతూ మాతృత్వానికి మాయనిమచ్చతెచ్చిన నీలమ్మను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Follow Us