కలికాలం.. ఆస్తి కోసం కన్నతల్లి శవాన్ని ఎత్తుకెళ్లిన పెద్దకొడుకు.. శ్మశానంలో కోడిని పూడ్చిన చిన్నకొడుకు!

ఆస్తి పిచ్చి మనుషులను ఎంతగా దిగజారుస్తుందో చెప్పడానికి మెదక్ జిల్లాలో జరిగిన ఒక ఘటనే నిదర్శనం. కన్నప్రేమ కరువై, బంధాలు బూడిదైన ఈ విస్తుపోయే ఘటన చిన్నశంకరంపేట మండలంలోని భాగీర్తిపల్లి గ్రామంలో వెలుగుచూసింది. ఆస్తుల పంపకాల కోసం కన్నతల్లి పార్థివదేహం ముందే అన్నదమ్ములు కక్షలు, కార్పణ్యాలకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కలికాలం.. ఆస్తి కోసం కన్నతల్లి శవాన్ని ఎత్తుకెళ్లిన పెద్దకొడుకు.. శ్మశానంలో కోడిని పూడ్చిన చిన్నకొడుకు!
Funeral Stopped Over Land Dispute

Edited By:

Updated on: May 24, 2026 | 8:12 PM

కన్నప్రేమ కరువైంది.. బంధాలు బూడిదయ్యాయి..ఆస్తి పిచ్చి ముందు అమ్మ ప్రేమే ఓడిపోయింది..తల్లి ప్రాణం పోయినా ఆ అన్నదమ్ముల మధ్య భూవివాదం చల్లారలేదు. ఆస్తుల పంపకాలు తేలితేనే అమ్మ అంత్యక్రియలు జరగనిస్తామంటూ ఓ కొడుకు చేసిన రచ్చ మెదక్ జిల్లాలో కలకలం రేపింది..కన్నతల్లి మరణించినా ఆ అన్నదమ్ముల మనసు కరగలేదు. ఆస్తి తగాదాలు చివరకు కన్నతల్లి అంత్యక్రియలకే అడ్డంకిగా మారాయి.. పూర్తి వివరాల్లోకి వెళితే..

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లిలో ఆస్తి పిచ్చితో కన్నతల్లి శవం ముందే అన్నదమ్ములు గొడవకు దిగిన అమానుష ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన రెడ్డి చంద్రమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో తన చిన్న కుమారుడైన గోపాల్ వద్ద కన్నుమూసింది. తల్లి చనిపోయిందన్న వార్త విని పెద్ద కుమారుడు నాగరాజు అక్కడికి చేరుకున్నాడు. అయితే, తల్లి మరణానికి బాధపడాల్సింది పోయి, గతంలో అమ్మిన భూమి డబ్బుల పంపకాలను తేల్చాలంటూ తమ్ముడితో గొడవకు దిగాడు. ఆస్తుల పంపకాలు పూర్తి చేసి, బాండ్ పేపర్ రాసిస్తేనే అంత్యక్రియలు జరగనిస్తామని నాగరాజు భీష్మించుకు కూర్చున్నాడు.

అన్న గొడవ చేస్తుండటంతో చిన్న కుమారుడు గోపాల్ చిన్నశంకరంపేటలోనే తల్లి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాడు. శ్మశానంలో బొంద తవ్వి, పాడె కూడా సిద్ధం చేశారు. సరిగ్గా అదే సమయంలో పెద్ద కుమారుడు నాగరాజు తన అనుచరులతో వచ్చి, తల్లి మృతదేహాన్ని బలవంతంగా వాహనంలో ఎత్తుకెళ్లాడు. ఈ వివాదం కాస్తా పోలీసుల వరకు చేరింది. తమ స్వగ్రామమైన భాగీర్తిపల్లిలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని పెద్ద కుమారుడు స్పష్టం చేయగా, అక్కడికి వెళ్తే తనపై దాడి జరుగుతుందేమోననే భయంతో చిన్న కుమారుడు గోపాల్ కన్నతల్లి చివరి చూపుకు, అంత్యక్రియలకు దూరమయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, అప్పటికే శ్మశానంలో తవ్విన బొందను (గోతిని) ఖాళీగా వదిలేయడం ఆచారానికి విరుద్ధమని, అరిష్టమని పెద్దలు భావిస్తారు. దీంతో చేసేది లేక శ్మశానంలో తవ్విన బొందను ఖాళీగా పూడ్చకూడదనే నమ్మకంతో, చిన్నకొడుకు గోపాల్ ఒక కోడిని, అంత్యక్రియల కోసం తెచ్చిన పూలు, ఇతర పూజా సామగ్రిని ఆ బొందలో వేసి మట్టితో పూడ్చిపెట్టాడు. ఆస్తి కోసం కన్నతల్లి శవాన్ని సైతం వదలకుండా అన్నదమ్ములు ప్రవర్తించిన తీరుపై స్థానికులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసం ఇంతగా దిగజారాలా అంటూ ఛీత్కరించుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us