అనస్థీషియా లేని కాలంలో ఆపరేషన్లు ఎలా చేసేవారో తెలుసా? వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది!
ప్రస్తుత రోజుల్లో చిన్న ఆపరేషన్ అయినా, పెద్ద సర్జరీ అయినా డాక్టర్లు మొదట రోగికి అనస్థీషియా (Anesthesia) ఇస్తారు. దీనివల్ల రోగికి ఎలాంటి నొప్పి తెలియకుండా సర్జరీ సులభంగా ముగిసిపోతుంది. కానీ, వైద్య చరిత్రలో అనస్థీషియా లేని ఒక చీకటి రోజులు ఉండేవని మీకు తెలుసా? ఆ కాలంలో శస్త్రచికిత్స అంటే రోగులు ప్రాణ భయంతో వణికిపోయేవారు. మత్తుమందు కనిపెట్టకముందు సర్జరీలు ఎంత భయానకంగా సాగేవో ఇక్కడ తెలుసుకుందాం.

అందిన సమాచారం మేరకు.. ఆధునిక వైద్యశాస్త్రంలో అనస్థీషియా (మత్తుమందు) ఆవిష్కరణ ఒక గొప్ప మైలురాయి. అనస్థీషియా కనుగొనకముందు సర్జరీలు (ఆపరేషన్లు) రోగులకు నరకప్రాయంగా ఉండేవి. ఆ కాలంలో సర్జరీ సమయంలోనే చాలా మంది రోగులు చనిపోయేవారు. పూర్వ కాలంలో సర్జరీ చేసే సమయంలో రోగి నొప్పి భరించలేక కదలకుండా ఉండేందుకు వారి చేతులు, కాళ్లను మంచానికి గట్టిగా కట్టేసేవారు. లేదా నలుగురైదుగురు బలమైన వ్యక్తులు రోగిని గట్టిగా పట్టుకునేవారు. రోగి ఎంత గట్టిగా అరిచినా, ఏడ్చినా డాక్టర్లు సర్జరీని ఆపేవారు కాదు. కొన్నిసార్లు నొప్పి తీవ్రతకు తట్టుకోలేక రోగులు ఆపరేషన్ థియేటర్ లోనే గుండె ఆగి చనిపోయేవారు.
నొప్పి తీవ్రతను కొద్దిగా తగ్గించడానికి ఆ రోజుల్లో డాక్టర్లు కొన్ని వింతైన, ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకునేవారు. రోగికి విపరీతంగా మద్యం (ఆల్కహాల్) తాగించి మత్తులోకి దించేవారు. మరికొన్ని సందర్భాల్లో రోగి స్పృహ తప్పి పడిపోయేలా చేయడానికి తలపై బలంగా కొట్టేవారు. అలాగే నల్లమందు, లేదా కొన్ని రకాల మూలికల రసాన్ని ఇచ్చేవారు. అయినప్పటికీ కోసేటప్పుడు కలిగే తీవ్రమైన నొప్పి నుండి వారికి ఉపశమనం లభించేది కాదు.
ఈ భయానక పరిస్థితికి 1846లో తెరపడింది. అమెరికాకు చెందిన విలియం టి.జి. మోర్టన్ (William T.G. Morton) అనే డెంటిస్ట్, ఈథర్ (Ether) అనే రసాయనాన్ని శ్వాస ద్వారా పీల్చడం వల్ల మనుషులు తాత్కాలికంగా స్పృహ కోల్పోతారని నిరూపించారు. 1846 అక్టోబర్ 16న బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో ఒక రోగి మెడపై ఉన్న గడ్డను తొలగించడానికి ఈథర్‌ను మత్తుమందుగా ఇచ్చి మొదటి విజయవంతమైన సర్జరీ చేశారు.
ఈ చారిత్రాత్మక రోజు జ్ఞాపకార్థంగానే ప్రతి సంవత్సరం అక్టోబర్ 16ను ప్రపంచ అనస్థీషియా దినోత్సవం (World Anesthesia Day) గా జరుపుకుంటారు. ఈ ఒక్క ఆవిష్కరణ కోట్ల మంది రోగులకు శస్త్రచికిత్స నరకం నుండి విముక్తి ప్రసాదించింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




