Telangana: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌కు నల్లగొండ పోలీసుల చెక్.. ఎలా పట్టుకున్నారో తెలుసా..?

మద్యం ఎర.. దొంగతనాల్లో స్పెషల్ ట్రైనింగ్.. సీసీటీవీల కళ్లు గప్పడంలో దిట్ట.. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసిరిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కథ ఎట్టకేలకు ముగిసింది. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ, ఏకంగా 9 మందితో గ్యాంగ్ ఏర్పాటు చేసి 40కి పైగా చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును నల్లగొండ పోలీసులు రట్టు చేశారు.

Telangana: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌కు నల్లగొండ పోలీసుల చెక్.. ఎలా పట్టుకున్నారో తెలుసా..?
Bhushmi Srikanth Arrested By Nalgonda Police

Edited By:

Updated on: Jul 18, 2026 | 9:08 PM

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చెందిన భూష్మి శ్రీకాంత్.. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారాడు. పలు దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. ఇటీవలే శ్రీకాంత్‌ను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్థుడిగా ఎదగడానికి శ్రీకాంత్ ఎంచుకున్న మార్గం చాలా విభిన్నం. విజయవాడ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నల్గొండ ప్రాంతాల్లో వైన్ షాపుల వద్ద ఒంటరిగా కనిపించే యువకులను టార్గెట్ చేస్తాడు. వారి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని, మద్యం, డబ్బు ఎర వేసి 9 మందితో గ్యాంగ్ ఏర్పాటు చేసి తన నేర సామ్రాజ్యంలో పావులుగా వాడుకోవడం శ్రీకాంత్ స్టైల్.

చోరీలకు ప్రత్యేక శిక్షణ..

సాధారణ దొంగలకు, శ్రీకాంత్ గ్యాంగ్‌కు చాలా తేడా ఉంది. వీరు దొంగతనం చేసే ముందు పక్కా ట్రైనింగ్ తీసుకుంటారు. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల కళ్లు గప్పడం, పోలీసులు పసిగట్టకుండా వేలిముద్రలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి మెళకువలను తన గ్యాంగ్‌కు శ్రీకాంత్ నేర్పించేవాడు. అందుకే గత కొంతకాలంగా ఈ గ్యాంగ్ ఆగడాలను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 పైగా చోరీలకు ఈ ముఠా పాల్పడింది. నల్లగొండ జిల్లాలో కూడా జరిగిన చోరీ కేసులకు సంబంధించి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాడు. ఈ గ్యాంగ్ కదలికలపై నిఘా పెట్టిన నల్గొండ పోలీసులు, నేర స్థలాల్లో దొరికిన కీలకమైన వేలిముద్రల ఆధారంగా అసలైన సూత్రధారిని గుర్తించారు. ఇటీవల పోలీసులు.. హైదరాబాదు ఓఆర్ఆర్‌పై కాల్పులు జరిపి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీకాంత్ ను అరెస్టు చేశారు.

శ్రీకాంత్ విచారణలో బయట పడుతున్న విషయాలు పోలీసులకే షాకింగ్‌గా ఉన్నాయి. చాకచక్యంగా వ్యవహరించి ఏపీలోని పిడుగురాళ్ల, అంజనీపురం, మండేపూడి అమరావతి ప్రాంతంలో శ్రీకాంత్ గ్యాంగ్‌ను నల్గొండ పోలీసులు పట్టుకున్నారు. ముఠాలోని ఆరుగురు సభ్యులను అరెస్టు చేశామని, మరో ఇద్దరు సభ్యులు పరారీలో ఉన్నారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితుల నుండి 26 తులాల బంగారు ఆభరణాలు, 5 కేజీల వెండి ఆభరణాలు, లక్షన్నర నగదు, రెండు టీవీలు, 5 బైక్స్, 7 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసిరిన మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు భూష్మి శ్రీకాంత్ నేర సామ్రాజ్యాన్ని ఎట్టకేలకు నల్గొండ పోలీసులు ఛేదించారు.

Follow Us