Telangana: ‘రాజకీయ వేదికగా గవర్నర్ కార్యాలయం’.. తమిళిసై కామెంట్స్‌కు కవిత కౌంటర్

గత మూడేళ్లుగా చాలా అవమానాలు ఎదుర్కొన్నానని గవర్నర్ తమిళిసై సంచలన ఆరోపణలు చేశారు. చెప్పకూడని అంశాలెన్నో ఉన్నాయంటూ కూడా బాంబ్ పేల్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఇలా మహిళా గవర్నర్‌ పట్ల వివక్ష చూపడం సరైంది కాదన్నారు.

Telangana: రాజకీయ వేదికగా గవర్నర్ కార్యాలయం.. తమిళిసై కామెంట్స్‌కు కవిత కౌంటర్
Tamilisai Soundararajan Vs MLC Kavitha

Updated on: Sep 08, 2022 | 8:06 PM

Governor Vs Government: తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా రాజ్‌భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తమిళిసై. మీడియాతో మాట్లాడారు. ఆమె మాట్లాడిన దాంట్లో అత్యధిక శాతం ప్రభుత్వ తీరునే తప్పుబట్టారు. కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయకపోవడం దగ్గరి నుంచి ఇటీవల బాసర ట్రిపుల్‌ ఐటీలో తన పర్యటన వరకు అన్ని అంశాల్లోనూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకటి రెండు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ను నేరుగా టార్గెట్‌ చేశారు గవర్నర్‌. ఎట్‌ హోంకు వస్తానని ఎందుకు రాలేదో చెప్పలేదన్నారు. రాజ్‌భవన్‌ ఏమన్నా అంటరాని స్థలామా అని ప్రశ్నించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జెండా ఎగురవేయొద్దా అని వ్యాఖ్యానించారు. కేంద్రం వివక్ష చూపుతోందన్న టీఆర్‌ఎస్‌ విమర్శల నేపథ్యంలో సదరన్‌ రాష్ట్రాల సమావేశానికి సీఎం ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇక్కడ జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘన దేశం అంగీకరిస్తుందా అన్నారు. గవర్నర్ ఆఫీస్ నుండి వెళ్లే లేఖలకు సమాధానం ఇవ్వరని, ప్రోటోకాల్‌ పాటించడం లేదని విమర్శించారు. సెప్టెంబర్‌ 17న విమోచన దినంగానే పాటించాలన్నారు గవర్నర్‌.

రాజకీయ వేదికగా గవర్నర్ కార్యాలయం:

గవర్నర్ తమిళసై కామెంట్స్‌పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఆమె ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని , సీఎం కేసీఆర్ గారిని అపఖ్యాతి పాలు చేయడానికి తెలంగాణ గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజల మన్ననలను పొందలేరని గ్రహించిన బీజేపీ ..  గవర్నర్ నుంచి ఇలాంటి మాటలు మాట్లాడిస్తుందని ఆరోపించారు.

తమిళిసై బీజేపీ కార్యకర్తలా వ్యవహరించకూడదని, హుందాగా ఉండాలని సూచించారు మరో మంత్రి ఎర్రబెల్లి. ఆమె ఒక రాజకీయ నాయకురాలిగా మాట్లాడుతున్నారని విమర్శించారు ఇంకో మంత్రి సత్యవతి రాథోడ్‌. బీజేపీకి లబ్ధిచేకూర్చాలని గవర్నర్‌ చూస్తున్నారని విమర్శించారు మంత్రి జగదీష్‌రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..