
గతంలో తెలుగు రాష్ట్రాల్ల మిర్చి పంటకు ఈ మాయదారి తెగులు లేదు. గత నాలుగైదు ఏళ్లుగా కాత, పూత దశలో మిర్చి పంటను నాశనం చేస్తుంది తామర పురుగు. దీన్ని అరికట్టి పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర వ్యయప్రయాసలు పడుతున్నారు. వారం, పది రోజులకే మందు కొట్టాల్సి వస్తుంది. ఇక అకాల వర్షాల బెడద ఎలాగూ ఉంది. పాపం మిర్చి రైతులను ఆదుకునే నాధుడే లేకుండా పోయాడు. గత ఏడాది కూడా దిగుబడి బాగా తగ్గింది. రేటు కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఈ ఏడాది రైతులకు కాస్త ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. రేట్లు కాస్త బాగానే ఉన్నాయి. సీజన్ ప్రారంభంలో మిర్చి పంటకు మంచి రేటు దక్కింది. పంట దిగుబడి అధికంగా వచ్చే సమయంలో కూడా ఇదే రేటు కొనసాగితే రైతులకు కాస్త లాభసాటిగా ఉంటుంది.
శుక్రవారం రోజున వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో టమాటా రకం మిర్చి.. క్వింటార్ ధర ఏకంగా రూ.30 వేలు పలికింది. ఇక తేజ షార్క్ రకం మిర్చి కింటా… రూ.15,111లు పలికింది. దీంతో మిర్చి రైతులు ఊరట చెందారు. ఇదే ధర సీజన్ ఎండింగ్ వరకు కొనసాగితే అప్పుల నుంచి బయటపడుతామంటున్నారు. అటు మొక్కజొన్న సైతం.. బిల్టీ రకం క్వింటాల్‌కు రూ.2,075 పలికింది. గత అనుభవాల వల్ల మిర్చి పంట ఈ ఏడాది ఎక్కువగా సాగు చేయలేదు. దీంతో ఈ సారి దిగుబడి తగ్గి మంచి ధర వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.