KTR writes to Centre: తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కే. తారక రామారావు (కేటీఆర్) మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుల కేటాయింపులోనూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందంటూ ఐటీ మినిస్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా కేటాయింపులోనూ తెలంగాణపై కేంద్రం (Central government) తీవ్ర వివక్ష చూపిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం తాజాగా ప్రకటించిన సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుల్లో (IT Parks) ఒక్కటంటే ఒక్కటికూడా తెలంగాణకు కేటాయించ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళ రాష్ట్రాల్లో 22 ఎస్టీపీఐలను కేటాయించిదని చెప్పారు కేటీఆర్. కాని తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించకపోవడం అన్యాయమన్నారు.
దీనిపై కేంద్రం తీరునూ తప్పుబడుతూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. దేశ ఐటీ పరిశ్రమలో అద్భుతంగా రాణిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ.. ఒకటని లేఖలో పేర్కొన్నారు. కొన్నేళ్లుగా జాతీయ సగటు కన్నా ఎక్కువ వృద్ధిరేటును నమోదు చేస్తున్న విషయాన్ని మంత్రికి గుర్తుచేశారు. 2014 రాష్ట్రంలో ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య కూడా రెట్టింపైందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీరంగంలో 6లక్షల 28వేల మందికి పైగా పని చేస్తున్నారని లేఖలో రాశారు. అంతర్జాతీయ ఐటీ హబ్‌గా హైదరాబాద్ తయారైందని.. హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని లేఖలో తెలిపారు మంత్రి కేటీఆర్.
వీటన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా ఎస్టీపీఐ కేటాయింపుల్లో తెలంగాణను పక్కనపెట్టడం దారుణమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇక్కడి యువత ఉపాధి అవకాశాలను కేంద్ర ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని మండిపడ్డారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ రద్దు చేసి, తెలంగాణ ఐటీ రంగానికి, యువతకు తీరని ద్రోహం చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు మంత్రి కేటీఆర్.
Also Read: