హైదరాబాద్, అక్టోబర్ 10: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేసే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి అసంతృప్తుల జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యమంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకు సీట్లు దక్కకపోవడంతో.. ఆయా ఎమ్మెల్యేలు ఇంతకాలం అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ వారితో సంప్రదింపులు జరిపి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. ఈ క్రమంలో జనగామ BRS అభ్యర్థి విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. జనగామ టికెట్‌కు బదులుగా టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేపట్టడంతో సమస్య సెటిల్ అయినట్టే కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్లబ్ హౌస్‌లో పల్లా రాజేశ్వరరెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో మంత్రి కే తారక రామారావు సమావేశమయ్యారు. జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించాలని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కేటీఆర్ కోరారు. ఈ క్రమంలో ఇద్దరితో మాట్లాడి వారితో చేతులు కలిపించి కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. దీంతో జనగామ టికెట్ విషయమై BRSలో నెలకొన్ని వివాదానికి తెరపడినట్టు అయింది. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు జనగామ టికెట్ ఆశించిన మరో ఇద్దరు నేతలు మండల శ్రీరాములు, కిరణ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
అయితే, జనగామ టికెట్ విషయమై గత కొన్నాళ్లుగా BRSలో తీవ్ర పోరు జరుగుతోంది. పల్లా రాజేశ్వరరెడ్డి అభ్యర్థిత్వాన్ని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అర్థనగ్న ప్రదర్శనలూ చేపట్టారు. హైదరాబాద్‌లో పోటాపోటీ సమావేశాలు, ఆడియో లీకులతో జనగామ జగడం ముదిరిపోయింది. అధిష్టానం సంప్రదించినా చల్లారలేదు.. చివరకు కేటీఆర్ రంగంలోకి దిగి మాట్లాడటంతో ముత్తిరెడ్డి పల్లాకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
జనగామ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై చుట్టూ అనేక వివాదాలున్నాయి. దానికి తోడు ఆయన కూతురు తుల్జా భవానిరెడ్డి తన తండ్రి కబ్జాకోరు అని బహిరంగంగా ఆరోపించారు. అయితే BRS నాయకత్వం ముత్తిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇవ్వడంతో జనగామ జగడానికి ఫుల్‌స్టాప్ పడ్డట్టు అయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..