Minister KTR video conference: ప్రపంచ దిగ్గజ టెక్స్‌టైల్స్ కంపెనీ యంగ్వాన్.. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కులో ఫ్యాక్టరీల నిర్మాణానికి సిద్ధమైనట్టు వెల్లడించింది. ఈ మేరకు కంపెనీ యాజమాన్యం వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రి కేటీ రామారావుకు వివరించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే టెక్స్‌టైల్స్ రంగంలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని కేటీఆర్ చెప్పారు.
వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌లో మరో 6 నెలల్లో కొరియాకు చెందిన టెక్స్‌టైల్స్ దిగ్గజం యంగ్వాన్ కంపెనీ తన ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి చేయనుంది. ఆరు నెలల తర్వాత ప్రపంచానికి మేడిన్ తెలంగాణ వస్త్రాలు కాకతీయ టెక్స్‌టైల్స్ పార్క్ నుంచి అందనున్నాయని కంపెనీ చైర్మన్ కీహక్ సుంగ్ తెలిపారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరిశ్రమల ముఖ్య అధికారులతో కంపెనీ ఛైర్మన్ సుంగ్ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ముందుగా ప్రకటించిన విధంగా తమ కంపెనీ కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌లో పెట్టుబడి ప్రణాళిక కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రానున్న ఆరు నెలల్లో ఐదు ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రెండవ దశలో మరో 3 ఫ్యాక్టరీలను నిర్మిస్తామని చైర్మన్ సుంగ్ తెలిపారు.గతంలో ప్రకటించిన విధంగా ఇప్పటికే ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తికావాల్సి ఉన్నా..కరోనా పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా కొంత ఆలస్యమైందన్నారు. తమ కంపెనీ ప్రకటన నాటి నుండి ఇప్పటివరకూ తెలంగాణ సర్కార్ అన్నివిధాలుగా సపోట్‌గా నిలుస్తోందని ప్రశంసలు కురిపించారు.
In a video conference with Ministers @KTRTRS and @DayakarRao2019 South Korea’s textile major Youngone Chairman and CEO Mr. Ki-Hak Sung reiterated their plan of making five of their factories functional in next six months and taking up another three later in Phase-II. pic.twitter.com/b7HWHpRjSW
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 1, 2021
ప్రపంచదిగ్గజ టెక్స్‌టైల్స్ కంపెనీ యంగ్వాన్ వరంగల్‌లో తమ ఫ్యాక్టరీలను త్వరలో పూర్తిచేయాలని సిద్ధంకావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఇది తెలంగాణలోనే కాదు..భారతదేశ టెక్స్‌టైల్స్ రంగంలోనూ ఒక మైలురాయిగా నిలిపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో యాంగ్వాన్‌తో పాటు మరికొన్ని కొరియన్ కంపెనీలు కూడా త్వరలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు. కంపెనీ ఫ్యాక్టరీల నిర్మాణానికి సంబంధించి అవసరమైన అన్ని రకాల సహాయసహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్…కంపెనీ ఛైర్మన్ సుంగ్‌కు హామీ ఇచ్చారు.
యంగ్వాన్ కంపెనీ ఏర్పాటైతే ప్రత్యక్షంగా 12 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక వరంగల్ ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు…మంత్రి కేటీఆర్‌ను కోరారు. గ్రామీణ అభివృద్ధి శాఖ అధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యంగ్వాన్ కంపెనీ కార్యకలాపాలపై అవసరమైన రీతిలో ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు.