Medico Preethi: మృత్యువుతో పోరాడి ఓడిన మేడికో విద్యార్థిని ప్రీతి.. ప్రకటించిన వైద్యులు
వరంగల్ ఎమ్‌జీఎమ్ హాస్పిటల్‌లో మెడిసిన్ చేస్తున్న ప్రీతి చనిపోయింది... కాదు.. కాదు మనమే చంపేసుకున్నాం. జీవించే హక్కును ఆమెనుంచి మనమే లాక్కున్నాం.. సామాజిక పరిస్థితులే ప్రీతిని మట్టుబెట్టాయంటే..

వరంగల్ ఎమ్‌జీఎమ్ హాస్పిటల్‌లో మెడిసిన్ చేస్తున్న ప్రీతి చనిపోయింది… కాదు.. కాదు మనమే చంపేసుకున్నాం. జీవించే హక్కును ఆమెనుంచి మనమే లాక్కున్నాం.. సామాజిక పరిస్థితులే ప్రీతిని మట్టుబెట్టాయంటే కరెక్టేమో. బుద్ధిగా చదువుకునే ఒక తెలివైన అమ్మాయి ప్రాణాన్ని నిలువునా తీసేసిన ఈ మొత్తం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం.
నాలుగురోజులుగా మృత్యువుతో పోరాడుతున్న మెడికో ప్రీతి ఆరోగ్యం చివరివరకూ మెరుగుపడనే లేదు. మొదటినుంచి ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్టు చెప్పాయి నిమ్స్ వైద్యుల హెల్త్ బులెటిన్లు. ఆదివారం కూడా ఆమెకు వెంటిలేటర్, ఎక్మోపైనే ట్రీట్‌మెంట్ జరిగింది. ప్రీతికి కంటిన్యువస్‌గా డయాలసిస్ చేస్తూనే వచ్చారు డాక్టర్లు. ఐనా.. ఓటమిని ఒప్పుకుని, పోరాటాన్ని చాలించి.. మృత్యు కౌగిలికే చేరిపోయింది ప్రీతి. ప్రీతి బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు.
ప్రీతిది ఆత్మహత్యా, లేక హత్యా.. ఇదొక అంతుబట్టని మిస్టరీగా మారిందిప్పుడు. ఎమ్‌జీఎమ్‌లో సీనియర్ పీజీ సైఫ్ వేధింపులే ప్రీతి చావుకు దారితీశాయన్నది మెయిన్ వెర్షన్. ఒక సీనియర్‌గా తనకు సహకరించాల్సింది పోయి వేధించినట్టు ఆమె చివరి మాటల ద్వారా తెలుస్తోంది. ఆమె తల్లి దండ్రులు మాత్రం. అతడే తమ కూతుర్ని పొట్టన బెట్టుకున్నారని ఆవేదనతో చెబుతున్నారు.
డిసెంబర్ 6 నుంచి మూడుసార్లు ప్రీతికీ, సైఫ్‌కీ మధ్య చిన్నచిన్న క్లాషెస్ జరిగాయి. ఆ క్యాంపస్‌లో సీనియర్లను జూనియర్లు సార్ అని పిలవాలనే సిస్టమ్ ఉంది. ఇది బాసిజం.. అంటూ ఆమె ప్రతిఘటించడంతోనే ఘర్షణ మొదలైందన్నది ఫ్రెండ్స్ మాట. ఈ నెల 18న వాట్సాప్ గ్రూప్‌లో ప్రీతితో ఛాటింగ్ చేసి.. వేధించడం మొదలుపెట్టాడు. 20వ తేదీన వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పుకుంది ప్రీతి. 21వ తేదీన కాలేజీ యాజమాన్యం ప్రీతినీ, సైఫ్‌నీ పిలిచి విచారించింది కూడా.
ప్రీతిది ప్రశ్నించే గుణం. ఆమె ఎంత డేరింగో అంత సెన్సిటివ్ కూడా. ఏదైనా ఎదురెదురుగా నిలబడి తేల్చుకునే అలవాటు. అలా ఆమె ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడు. ఎకడమిక్ ఇష్యూస్‌లో ప్రీతికి కోఆపరేట్ చెయ్యొద్దని మిగతా వాళ్లక్కూడా చెప్పాడు. సైఫ్ అనే సీనియర్ తనకొక సమస్యగా మారడంపై ప్రీతి కంటిన్యూవస్‌గా ఆలోచించింది. ఏదోవిధంగా పరిష్కరించుకోవాలని తనకుతానుగా ప్రయత్నించింది. కానీ సైఫ్ సమస్యే తన జీవితానికి ఫుల్‌స్టాప్ పెడుతుందని గ్రహించలేకపోయింది ప్రీతి.
సైఫ్ నన్ను వేధిస్తున్నాడు అంటూ ఫ్రెండ్స్‌తో చేసిన ఛాట్‌లో కూడా చెప్పుకుంది ప్రీతి. గేలి చేస్తున్నాడు.. గ్రూపులో పోస్టులు పెట్టి అవమానపరుస్తున్నాడు. అంటూ హెచ్‌ఓడీల్ని కూడా కలిసింది. తల్లిదండ్రుల దగ్గర కూడా గోడు వెళ్లబోసుకుంది. ఐనా తమ గారాలబట్టిని కాపాడుకోలేకపోయామని బోరుమంటోంది ప్రీతి కుటుంబం.
ప్రీతి విషాదం ఎన్నో విచిత్రమైన మలుపులు తిరిగింది. ఇది ర్యాగింగ్ కేసు అని కొందరంటే.. ప్రేమ వ్యవహారమని మరికొందరు చెప్పుకున్నారు. తర్వాత ప్రీతి అంశం రాజకీయ రంగు పులుముకుంది. పరామర్శ కోసం వెళ్తూ గవర్నర్ పూలమాల తీసుకెళ్లడం విమర్శలకు తావిచ్చింది. ఇది లవ్ జిహాద్ తరహా ఘటన అంటూ బీజేపీ స్టేట్‌మెంట్ ఇస్తే.. వివాదాస్పదం చెయ్యొద్దని వారించింది అధికార పార్టీ. ప్రీతి తండ్రి కూడా తన కూతురి విషయంలో లవ్‌జిహాద్ కోణం లేదనే చెప్పారు.
ఒకవైపు ప్రీతి మృత్యువుతో పోరాడుతుంటే న్యాయం చేయాలంటూ గొంతెత్తి అరిచింది ఆమె సోదరి. మాక్కావల్సింది పరామర్శలు కాదు అంటూ ప్రభుత్వాల్ని నిలదీసిన ప్రీతి సోదరి. ఆ దుర్మార్గుడ్ని మాకొదిలేయండి… మేమే చూసుకుంటాం అనేంత తెగువ చూపిందామె.
నాలుగురోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాటం.. ఆమె బతికి రావాలని కుటుంబీకులు పడ్డ ఆరాటం.. రెండింటికీ ఇవాళే ఫుల్‌స్టాప్ పడింది. ఆమె తుదిశ్వాస విడిచింది. నియర్ అండ్ డియర్స్‌తో పాటు సొసైటీలోని అన్ని కార్నర్స్ నుంచి ఆమె కోలుకోవాలంటూ ప్రార్థనలు జరిగినా ఫలితం లేకపోయింది. అరెస్టయి జైల్లో ఉన్న సైప్‌ని విచారిస్తే తప్ప.. ప్రీతి మృతి మిస్టరీలో మిగతా విషయాలు వెలుగులోకొచ్చే ఆస్కారముంది.