
Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కి ప్రాణహాని ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన భద్రతపై మేడ్చల్ డీసీపీ సందీప్ ఆరా తీశారు. డీజీపీ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు శామీర్‌పేటలోని ఈటల నివాసానికి వచ్చిన డీసీపీ సందీప్.. భద్రత విషయమై ఆయనతో చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్ఎల్‌సీ కౌశిక్‌రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని డీసీపీకి ఈటల తెలిపారు. ఈ మేరకు ఆయన భద్రతపై డీజీపీ అంజనీ కుమార్‌కి నివేదికను ఇవ్వనున్నారు డీసీపీ సందీప్.
కాగా, 2 రోజుల క్రితం ఈటల రాజేందర్ దంపతులు ప్రాణహాని ఉందని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈటల దంపతుల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ డీజీపీతో మాట్లాడి, సీనియర్ IPSతో వెరిఫై చేయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫునే సెక్యూరిటీ ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఈటలతో మాట్లాడి భద్రత అంశాలను పరిశీలించాలని మేడ్చల్ డీసీపీని తెలంగాణ డీజీపీ ఆదేశించారు. అంజనీ కుమార్ ఆదేశాల మేరకు నిన్న ఉదయం ఈటల ఇంటికి వచ్చిన డీసీపీ.. ఇంటి పరిసరాలను పరిశీలించారు. అయితే రాజేందర్ బుధవారం అందుబాటులో లేకపోవడంతో గురువారం మళ్లీ ఆయన ఇంటికి వెళ్లి కలిశారు డీసీపీ సందీప్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం