Telangana: అయ్యో దేవుడా.. ఎంత పనైంది.. అప్పులు తీర్చడానికి దుబాయ్ వెళ్లాడు.. కానీ అంతలోనే..

బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళితే.. చివరకు శవమై మిగిలాడు. మెదక్ జిల్లాకు చెందిన యువకుడు సాయికిరణ్ దుబాయ్‌లో గుండెపోటుతో కన్నుమూశాడు. అప్పులు తీరుతాయని ఆశపడ్డ కుటుంబానికి గుండెకోత మిగిలింది. కనీసం ఆఖరి చూపుకైనా తమ బిడ్డ పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలంటూ ఆ తల్లిదండ్రులు చేతులెత్తి మొక్కుతున్నారు.

Telangana: అయ్యో దేవుడా.. ఎంత పనైంది.. అప్పులు తీర్చడానికి దుబాయ్ వెళ్లాడు.. కానీ అంతలోనే..
Medak Youth Dies Of Heart Attack In Dubai

Edited By:

Updated on: Jun 13, 2026 | 12:39 PM

కంటినిండా కలలు.. గుండెనిండా ఆశలు.. ఎలాగైనా అప్పులు తీర్చి, కన్నవారిని, కట్టుకున్న భార్యాపిల్లలను బాగా చూసుకోవాలనే తపన.. ఆ యువకుడిని ఏడు సముద్రాలు దాటించేలా చేసింది. లక్ష్మీదేవి కటాక్షం కలిగి, తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆశపడ్డ ఆ కుటుంబానికి విధి ఆఖరికి తీరని గుండెకోతను మిగిల్చింది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లాకు చెందిన చింతకింది సాయికిరణ్ అక్కడ పనిచేస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన చింతకింది సాయికిరణ్ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు గతేడాది మే నెలలో అప్పులు చేసి మరీ దుబాయ్‌కి పయనమయ్యాడు. అక్కడ మూడు నెలల పాటు ఓ కంపెనీలో పనిచేశాడు. అయితే అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ఉద్యోగం మానేసి, వేరే చోట పనిలో చేరాడు. అంతా సర్దుకుంటోంది, ఇకపై మంచి రోజులు వస్తాయనుకుంటున్న తరుణంలో విధి వంచించింది.

పనిచేస్తూనే కుప్పకూలిపోయాడు..

ఈ నెల 2న అక్కడ విధి నిర్వహణలో ఉండగా సాయికిరణ్‌కు ఒక్కసారిగా తీవ్ర గుండెపోటు వచ్చింది. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి శ్వాస విడిచాడు. సాయికిరణ్ మృతి చెందిన విషయాన్ని దుబాయ్ పోలీసులు అధికారికంగా చేగుంట పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు ఈ చేదు వార్తను శనివారం కుటుంబ సభ్యులకు చేరవేయడంతో వడియారం గ్రామం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

తండ్రి లేడనే విషయం తెలియని పసిపిల్లలు..

సాయికిరణ్ మరణ వార్త విన్న భార్య, వృద్ధ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తండ్రి ఇక లేడనే విషయం కూడా తెలియని ఇద్దరు చిన్న పిల్లలు అమాయకంగా చూస్తుండటం స్థానికులను కన్నీళ్లకు గురిచేస్తోంది. ఇంటికి పెద్ద దిక్కుగా, కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడింది. బంధువులు, గ్రామస్తులు సాయికిరణ్ ఇళ్లకు చేరుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.

చివరి చూపు కోసం ఎదురుచూపులు..

సరిహద్దులు దాటిన ప్రాణం.. చివరికి శవమై అక్కడే మిగిలిపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. పార్థివ దేహాన్ని చివరి చూపు కోసం స్వగ్రామానికి తీసుకురావాలని తల్లిదండ్రులు, భార్య ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు చేతులెత్తి మొక్కుతున్నారు. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడి, మృతదేహాన్ని త్వరితగతిన వడియారం గ్రామానికి చేర్చేలా చొరవ చూపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అలాగే అనాథలుగా మారిన ఆ ఇద్దరు పిల్లలను, వృద్ధ తల్లిదండ్రులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Follow Us