
ఖరీదైన విదేశీ మద్యం నేలపాలైతే ఆ కిక్కు ఏముంటుంది అనుకున్నారో ఏమో.. ! ధ్వంసం చేయాల్సిన సరుకు అడ్రస్ మార్చేశారు! లక్షల విలువైన మద్యాన్ని మాయం చేస్తూ కొందరు వేసిన స్కెచ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు ఇంటి దొంగల గుట్టు బయటపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు ఉద్యోగులతోపాటు ఇద్దరు కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు, లిక్కర్ స్కామ్ వెనుక ఉన్న అధికారుల పాత్రపై ముమ్మర విచారణ చేపట్టారు.
నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్‌లోని మరిడి బయో ఇండస్ట్రీ.. ఇప్పుడు ఒక మద్యం అడ్డాను తలపిస్తోంది. గత నెలలో హైదరాబాద్‌లో వివిధ కేసుల్లో పట్టుబడ్డ విదేశీ మద్యం బాటిళ్లను నాశనం చేయడానికి కస్టమ్స్ అధికారులు ఇక్కడికి తీసుకువచ్చారు. చట్టప్రకారం వాటన్నింటినీ రోలర్ల కింద వేసి ధ్వంసం చేయాలి. కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సుమారు 40 లక్షల రూపాయలకు పైగా విలువైన 783 విదేశీ మద్యం బాటిళ్లను అధికారులు ధ్వంసం చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టారు.
ఖరీదైన విదేశీ బ్రాండ్లు కావడంతో.. వాటిని బయట మార్కెట్ లో అమ్ముకోవడానికో ఎందుకోసమో పక్కన పెట్టేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ నిల్వలపై సమాచారం అందడంతో ఎక్సైజ్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరిశ్రమలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు, ఇద్దరు కార్మికులను అరెస్ట్ చేశారు. అయితే, కస్టమ్స్ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన ఈ ప్రక్రియలో ఇంత భారీగా మద్యం బాటిళ్లు ఎలా పక్కదారి పట్టాయి? దీని వెనుక ఏయే పెద్ద తలకాయల హస్తం ఉంది? అన్న కోణంలో విచారణ ముమ్మరం చేశారు. ధ్వంసం చేయాల్సిన మద్యాన్ని దాచిపెట్టిన ఈ ఘటనలో కొందరు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..