
ప్రతి ఏటా మే నెలలో ప్రకృతి ప్రేమికులను అలరించే మే పుష్పం ఆలస్యంగా వికసించి కనువిందు చేస్తుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్ కు చెందిన యాదగిరి లక్ష్మణ్ రావు ఇంటి పెరట్లో మే పుష్పం వికసించి చూపరులను ఆకర్షిస్తుంది. ఏడాదిలో మే నెలలో మాత్రమే వికసించే ఈ మే పుష్పం కోసం అనేక మంది పకృతి ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది ఆలస్యంగా జూలై మొదటి వారంలో వికసించడంతో ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. సుమారు నాలుగేళ్ల క్రితం ఓ నర్సరీలో యాదగిరి లక్ష్మణ్ రావు సతీమణి శ్యామల ఈ మొక్కల దుంపలను తెచ్చి ఇంటివద్ద నాటారు. దుంప నాటిన రెండో ఏడాది మేలో ఒక పువ్వు మాత్రమే పూయగా, మూడో ఏడాది మేలో రెండు పూలు పూసాయి. అయితే, ఈ ఏడాది ఆలస్యంగా జూలైలో మళ్ళీ మే పుష్పం వికసించి అందరినీ అబ్బురపరుస్తుంది.
పుట్‌బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ అనే అరుదైన జాతికి చెందిన ఈ పువ్వును భారతదేశంలో మే పుష్పం అని పిలుస్తారు. ఎండలు ఎక్కువగా ఉన్న మాసాల్లో ఏప్రిల్, మే నెలలో వికసిస్తుండటంతో మే పుష్పంగా పేరొచ్చింది. దుంప రకానికి చెందిన ఈ మొక్క భూమిలో విస్తరిస్తూ ఒక్కో దుంపకు ఏడాదికి ఒక పువ్వు మాత్రమే పూస్తుంది. ఇసుక నేలల్లో బాగా పెరిగే ఈ మే పుష్పం రోజులో సుమారు నాలుగు గంటల పాటు వికసించి ఉంటుంది. భూమిలో ఉన్న దుంప పరిమాణం బట్టి పువ్వు పరిమాణం ఉంటుంది. మే పుష్పం మొగ్గతొడిగిన నాటి నుంచి వికసించడానికి దాదాపు 20 రోజులు పడుతుంది. మే పుష్పం ఆలస్యంగా పూసిన కూడా ప్రకృతి ప్రేమికులు మే పుష్పాన్ని చూసి ఆనందిస్తూ తమ ఫోన్ లో సెల్ ఫీలు దిగుతూ సంబరపడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.