
వనపర్తి జిల్లా పానగల్ మండలం చింతకుంట గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారీ నాగుపాము జనవాసాల్లోకి చొరబడి, కోళ్ల గూటిపై దాడి చేయడమే కాకుండా.. అందులోని కోడిగుడ్లను అమాంతం మింగేసింది. అయితే అతిగా మింగేసిన గుడ్ల వల్ల ఆ పాము కదలలేని స్థితికి చేరుకోవడంతో చివరికి స్నేక్ క్యాచర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. గ్రామానికి చెందిన యాదగిరి స్వామి తన ఇంట్లో కోళ్లను పెంచుకుంటున్నారు. ఎప్పటిలాగే కోళ్లను బయటకు వదలడానికి వెళ్లిన అతడికి కోళ్ల అరుపుల బదులు భయంకరమైన బుసల శబ్దాలు వినిపించాయి. లోపలికి వెళ్లి చూడగా.. పెద్ద నాగుపాము పడగ విప్పి కనిపించడంతో ఆయన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆకలితో ఉన్న ఆ నాగుపాము అప్పటికే గూటిలోని ఒక కోడిపెట్టను కరిచి చంపేసింది. అంతేకాకుండా అందులో ఉన్న 9 కోడిగుడ్లను ఒకదాని వెనుక ఒకటి మింగేసింది. ఆ గుడ్ల బరువు, పరిమాణం వల్ల పాము శరీరం ఉబ్బిపోయి, అటు ముందుకు ఇటు వెనుకకు కదలలేని స్థితిలో చిక్కుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు భారీ పామును చూడటానికి యాదగిరి స్వామి ఇంటికి క్యూ కట్టారు. వెంటనే స్నేక్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చీర్ల కృష్ణసాగర్‌కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఆయన కోళ్ల గూటి నుంచి పామును బయటకు తీశారు. దాని పొట్టపై మెల్లిగా ఒత్తిడి తీసుకురావడంతో పాము మింగిన 9 గుడ్లను బయటకు కక్కేసింది. దీంతో పాము తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. అనంతరం ఆ నాగుపామును సమీపంలోని అడవి ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.
ఈ సందర్భంగా కృష్ణసాగర్ మాట్లాడుతూ.. వేసవి కాలం లేదా వర్షాకాలంలో పాములు ఆహారం కోసం జనవాసాల్లోకి రావడం సహజమని, వాటిని చూసి భయాందోళన చెందవద్దని కోరారు. పాములను చంపకుండా తమకు సమాచారం అందిస్తే, వాటిని రక్షించి అడవిలో వదిలేస్తామని గ్రామస్తులకు సూచించారు. సమయానికి స్పందించి నాగుపాము ప్రాణాలు కాపాడిన కృష్ణసాగర్‌ను గ్రామస్తులు అభినందించారు.