
నిర్మల్ జిల్లా కడెం మండలంలో తీవ్ర విషాదం నెలకొంది.మాసాయిపేట గ్రామ సర్పంచ్ లహరిక వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనతో ఆమెను వెంటనే ఖానాపూర్ ఆసుపత్రికి తరలించేందుకు కారులో బయలుదేరారు. ప్రాణాలు కాపాడుకోవాలనే ఆరాటంతో వేగంగా వెళ్తున్న కారుకు విధి మరో రూపంలో ఎదురైంది. లహరికను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ నాగళ్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న లహరికతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు కదిలే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర గాయాలతో ఉన్న లహరికను మరో వాహనంలోకి మార్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కారు ప్రమాదం జరగడం వల్ల సమయం వృధా కావడం, దానికి తోడు ప్రమాదంలో తగిలిన గాయాల వల్ల లహరిక పరిస్థితి విషమించింది. వైద్యులకు చిక్కేలోపే ఆమె మార్గమధ్యంలోనే కన్నుమూశారు. సర్పంచ్ లహరిక మరణ వార్త తెలియగానే మాసాయిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అసలు లహరిక అంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? కారు ప్రమాదం వెనుక ఏవైనా ఇతర కోణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.