Mancherial Rain Effect: తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. ఇక భారీ వర్షాలు, వరదలతో మంచిర్యాల అతలాకుతలం అవుతోంది. మంచిర్యాలలో వరదలు 8 కాలనీలను ముంచెత్తాయి. ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇల్లు సైతం జలదిగ్బంధంలో ఉండిపోయింది. చెన్నూరు నియోజకవర్గంలో 35 గ్రామాలు నీటమునిగాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. వేలాది మంది వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలతో మంచిర్యాలలోని పలు కాలనీలు నీట మునిగాయి. రాత్రంతా కాలనీల్లో నీటి పెరుగుదల పరిశీలిస్తూ ప్రజలు క్షణక్షణభయంతో గడిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇల్లు కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. గోదావరిఖని బ్రిడ్జి దగ్గర వరద ప్రవహించడంతో మంచిర్యాలకు కరీంనగర్ రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వరదల కారణంగా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి..
కాగా, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్‌లలో ఐదు ఓపెన్‌కాస్టు గనులు ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా వాటిలో 44వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. కంపెనీకి సుమారు రూ. 15.4 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఐదు ఓసీపీల్లో దాదాపు 3.7 లక్షల క్యూబిక్‌మీటర్ల ఓవర్ బర్డెన్ (మట్టి) తొలగింపు పనులు నిలిచిపోయాయి. ఆరు రోజుల్లో కంపెనీలో 2లక్షల 64వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడగా, 21 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు పనులు నిలిచిపోయాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..