యూట్యూబర్ నా అన్వేష్‌కు మరో బిగ్ షాక్.. ఈ సారి అరెస్టే..! ఆ అకౌంట్లన్నీ క్లోజ్..

Naa Anveshana: వ్యూస్ కోసం హద్దులు దాటిన మాటలు, వ్యవస్థలను సవాల్ చేసే ధోరణి, మతపరమైన మనోభావాలతో చెలగాటం.. వెరసి యూట్యూబర్ అన్వేష్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు బ్లాక్ అయినా, బూతు పురాణం ఆపని ఈ యూట్యూబర్‌ను ఇండియాకు రప్పించేందుకు పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

యూట్యూబర్ నా అన్వేష్‌కు మరో బిగ్ షాక్.. ఈ సారి అరెస్టే..! ఆ అకౌంట్లన్నీ క్లోజ్..
Lookout Notice Issued Against Youtuber Naa Anvesh

Updated on: Feb 25, 2026 | 3:43 PM

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్‌కు పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న రచ్చ పరాకాష్టకు చేరడంతో పంజాగుట్ట పోలీసులు తాజాగా అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విశాఖపట్నానికి చెందిన అన్వేష్ విదేశాల్లో పర్యటిస్తూ వీడియోలు చేస్తుంటాడు. అయితే గత ఏడాది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, హిందూ ధర్మంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ నటి కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు విదేశాల్లో ఉండటంతో విచారణకు సహకరించకపోవడంతో తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌పై వేటు.. అన్వేష్ రెచ్చగొట్టే ధోరణి

ఇటీవల అన్వేష్ ప్రవర్తనపై ఫిర్యాదులు పెరగడంతో మెటా సంస్థ అతని అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను బ్లాక్ చేసింది. అయితే దీనిపై ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా, అన్వేష్ మరింత రెచ్చిపోయాడు. తనకు ఇంకా రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ అత్యంత అసభ్యకరమైన పదజాలంతో కూడిన వీడియోను విడుదల చేశాడు. అన్వేష్ విదేశాల్లో ఉంటూ చట్టాన్ని సవాల్ చేస్తుండటంతో పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.

అన్వేష్ ప్రస్తుతం వాడుతున్న ఇతర ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, యూట్యూబ్ ఛానళ్లను కూడా నిలిపివేయాలని కోరుతూ గూగుల్, మెటా సంస్థలకు పంజాగుట్ట పోలీసులు అధికారికంగా లేఖలు రాయనున్నారు. లుకౌట్ నోటీసుల నేపథ్యంలో అన్వేష్ ఏ దేశం నుండి ఇండియాకు వచ్చినా లేదా విమానాశ్రయాల్లో అడుగుపెట్టినా వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగిస్తారు. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్న అన్వేష్‌ను ఇండియాకు రప్పించేందుకు పోలీసులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు.

Follow Us