కొడితే దిమ్మతిరిగిపోవాలంతే.. అంటోంది కమలం పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన బూస్టప్‌తో.. భారీగా పార్లమెంట్ సీట్లు కొల్లగొట్టేలా వ్యూహాలు రచిస్తోంది కాషాయదళం. తెలంగాణలో పది అసెంబ్లీ సీట్లు గెలవడమే టార్గెట్‌గా బీజేపీ వ్యూహాలు రచిస్తోందట. దీనిపై రోడ్ మ్యాప్ ఇచ్చేందుకే బీజేపీ కా షహాన్ షా… అమిత్ షా హైదరాబాద్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ గురువారం జరగబోయే సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలపై రివ్యూ చేయడమే కాకుండా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధతపై శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారట. ఇంతకీ అమిత్ షా రచించబోయే ఆ రాజకీయ తంత్రమేంటి? తెలంగాణ లోక్‌సభ బరిలో దిగబోయే ఆ 17మంది నేతలెవరు.? అన్నదీ హాట్ టాఫిక్‌గా మారింది.
ఇలా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో.. అలా పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టార్గెట్ రీచ్ అవకపోయనా, ఫలితాలపై బీజేపీ అగ్రనాయకత్వం కొంత సంతృప్తిగానే ఉందట. 2018 ఎన్నికలతో పోలిస్తే, సీట్లు, ఓట్లు భారీగా పెరగడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు తెలంగాణ కాషాయ నేతలు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానం. కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాల్లో జెండా ఎగరేసింది. ఇప్పుడు ఏకంగా 8 ఎమ్మెల్యే సీట్లు గెలవడం, 19 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్ రావడంతో, పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సాధించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.
ఈ ఎన్నికలకు రోడ్ మ్యాప్ ఇచ్చేందుకు హైదరాబాద్ బాట పట్టారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. డిసెంబర్ 28న తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారైంది. కొంగర కలాన్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఫుల్ డే సన్నాహక సమావేశాలు జరగున్నాయి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలతో పాటు మొత్తం 12 వందల మంది ఈ మీటింగ్‌లో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకునేలా పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయడమే అమిత్ షా టూర్ టార్గెట్. పార్టీ ఫుల్ స్వింగ్‌లో ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునే వ్యూహాలు రచిస్తున్నారు అమిత్ షా.
అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లను సాధించడంతో పాటు, 19 చోట్ల రెండో స్థానంలో నిలిచింది బీజేపీ. ఇక ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగింది. గత ఎన్నికల్లో 7 శాతం ఉన్న ఓటింగ్, ఈసారి 14 శాతం ఓటు బ్యాంక్‌ను సొంతం చేసుకోగలిగింది. దీంతో పార్టీ కేడర్‌లో ఎప్పుడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ టికెట్‌కి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఒక్కో సీటు కోసం మూడు నుంచి ఐదుగురు నేతలు పోటీ పడుతున్నారట.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పాత నేతలు, సీనియర్ లీడర్లు ఓడిపోయారు. రాజాసింగ్ మినహా గెలిచిన వారంతా కొత్తవారే. దీంతో ఎంపీ సీట్లను సైతం కొత్త వారికే ఇవ్వాలనే ప్రతిపాదనను హైకమాండ్ పరిశీలిస్తోంది. సీనియర్ నేతలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ఓడిపోవడంపై అధిష్ఠానం లోతుగా విశ్లేషిస్తోంది. నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ఒకరిద్దరిని పక్కనబెట్టడం, లేదంటే వేరే చోటుకి మార్చే అవకాశం ఉందని పార్టీలోనే చర్చ జరుగుతోంది.
కరీంనగర్ ఎంపీ స్థానానికి గుజ్జుల రామకృష్ణా రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. తన సామాజికవర్గం ఓట్లను బూచిగా చూపించి టికెట్ కొట్టేసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇది బండి సంజయ్ వర్గానికి మింగుడు పడటం లేదట. ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు స్థానానికి పలువురు ఎసరు పెడుతున్నారట. అక్కడ రమేశ్ రాథోడ్, రాథోడ్ బాపూరావులు టికెట్ కోసం లాబీయింగ్ మొదలెట్టేశారట. మొన్నటి ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలోనే బీజేపీకి మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఎనిమిదిలో నాలుగు సీట్లు ఇక్కడ నుంచే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఎంపీ సీటు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని భావించిన నేతలు టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారట.
ఇక వరంగల్ నుంచి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను పోటీ చేయించనున్నారనే ప్రచారం సాగుతోంది. భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యకే తిరిగి టికెట్ దక్కనుందనే ప్రచారం పార్టీలో ఉన్నా, ఇదే సీటుపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి కన్నేశారట. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచారి రేసులో ఉన్నారు. మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కూడా సై అంటున్నారు. హైదరాబాద్ నుంచి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కన్వీనర్ భగవంతరావు పోటీకి సిద్ధంగా ఉన్నారట. ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
సమీకరణాలు, బలాబలాలు లెక్కలు వేసుకుని పక్కాగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉందట పార్టీ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా కాకుండా ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించారు. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర క్యాడర్ నుంచి అభిప్రాయాలు తీసుకుని ఢిల్లీ వెళ్తారట అమిత్ షా.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…