
జీవిత ఖైదు పడిన ఓ వ్యక్తి పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చి ఏకంగా 40 ఏళ్లకు పైగా తిరిగి జైలుకు వెళ్లకుండా జీవించడం ఇప్పుడు న్యాయస్థానంలో తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాదు.. తన గత నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేయడం, చివరకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన హైకోర్టు.. జైలు నుంచి విడుదలైన ఖైదీలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారా? అనే ప్రశ్నను లేవనెత్తింది. పెరోల్ గడువు ముగిసిన తర్వాత జైలుకు తిరిగి రాని ఖైదీలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అవసరమని అభిప్రాయపడింది.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన నందుల వీరన్నకు 1983లో ఓ హత్య కేసులో వరంగల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే అదే ఏడాది డిసెంబర్‌లో వీరన్న పెరోల్‌పై బయటకు వచ్చాడు. అతని పెరోల్ గడువు 1984 మార్చి 17తో ముగిసింది. నిబంధనల ప్రకారం ఆ తర్వాత జైలుకు తిరిగి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. వీరన్న మాత్రం తిరిగి జైలు ముఖం చూడలేదు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు దశాబ్దాలకు పైగా అతను జైలుకు దూరంగా ఉన్నాడు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరన్న సాధారణ జీవితం గడిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తనపై ఉన్న జీవిత ఖైదు విషయం దాచిపెట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. 2004లో అతనికి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కూడా లభించింది. ఇంతకాలం అతని నేర చరిత్ర, పెరోల్ నిబంధనల ఉల్లంఘన అధికారుల దృష్టికి రాకపోవడం ఇప్పుడు తీవ్ర ప్రశ్నలకు తావిస్తోంది.
సుమారు 40 ఏళ్ల తర్వాత 2024 మే 16న పోలీసులు వీరన్న ఇంటికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం అతడిని జైలు అధికారుల ఎదుట హాజరుపరిచింది. వీరన్న భార్య చారమ్మ ఈ పరిణామాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను ఇన్నేళ్ల తర్వాత అరెస్టు చేయడం, అతని పెరోల్‌ను మరో మూడేళ్లపాటు నిరాకరించడం సమంజసం కాదని ఆమె తరఫు న్యాయవాదివాదించారు.
అయితే ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది మరో విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పెరోల్ గడువు ముగిసిన తర్వాత వీరన్న జైలుకు తిరిగి రాకపోవడంతో వరంగల్ రూరల్, మహబూబాబాద్ పోలీసులకు జైలు అధికారులు పలుమార్లు లేఖలు పంపారని తెలిపారు. అతను ఇచ్చిన చివరి చిరునామాతో పాటు పరిసర గ్రామాల్లోనూ అతని కోసం గాలించినట్లు వివరించారు. చివరకు అతని ఆచూకీ లభించడంతో చట్టపరమైన చర్యలు తీసుకున్నామని కోర్టుకు తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవిత ఖైదు ఇంకా రద్దు కాలేదని, అయినప్పటికీ వీరన్న తన శిక్షను తప్పించుకుని జీవితంలో కీలకమైన సంవత్సరాలను జైలు బయట గడిపినట్లు కోర్టు పేర్కొంది. అతను ఉద్దేశపూర్వకంగానే జైలు శిక్షను తప్పించుకున్నట్లు కనిపిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అందువల్ల అతను తనకు విధించిన మిగిలిన శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. పెరోల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మూడేళ్లపాటు పెరోల్ నిరాకరించాలని అధికారులు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది.
ఒక జీవిత ఖైదీ నాలుగు దశాబ్దాలకు పైగా జైలు బయటే ఉండటం, ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం చేయడం, అవార్డు అందుకోవడం వంటి పరిణామాలు జైళ్ల శాఖ, సంబంధిత అధికారుల పర్యవేక్షణ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. పెరోల్‌పై బయటకు వెళ్లి గడువు ముగిసినా తిరిగి జైలుకు రాని ఖైదీలను వెంటనే గుర్తించేందుకు, వారిపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు నొక్కి చెప్పింది.
ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడిన వ్యక్తి.. పెరోల్ పేరుతో బయటకు వచ్చి.. ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు జైలు జీవితానికి దూరంగా ఉండటం, మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగడం.. ఇప్పుడు న్యాయవ్యవస్థలోనే కాకుండా జైళ్ల శాఖ పనితీరుపైనా తీవ్ర చర్చకు కారణమైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.