BRS – Congress: తగ్గేదేలే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లీగల్ వార్.. నోటీసులు ఇచ్చుకుంటున్న నేతలు..

|

Oct 01, 2024 | 7:43 PM

మాటలతోనే మజా ఏముంటుంది. దానిక్కాస్త లీగల్‌ ఫైట్‌ టచప్‌ కూడా ఇస్తే సంవాదం ఇంకా బలంగా ఉంటుంది. లీగల్‌ నోటీసులతో కొత్త ట్రెండ్‌ మొదలుపెట్టింది తెలంగాణ రాజకీయం. బీఆర్‌ఎస్‌ అగ్రనేతల్లో ఒకరు లీగల్‌ నోటీస్‌ అందుకుంటే.. మరొకరు కాంగ్రెస్‌ ఎంపీకి లీగల్‌ నోటీసిచ్చారు. అంతంకాదిది ఆరంభం అన్నట్లున్నాయ్‌ తెలంగాణ గడ్డపై లీగల్‌ పాలిటిక్స్‌.

BRS - Congress: తగ్గేదేలే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లీగల్ వార్.. నోటీసులు ఇచ్చుకుంటున్న నేతలు..
Congress BRS
Follow us on

తెలంగాణ పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్‌..  ఎప్పుడూ చూడని ట్రెండే.. అదేంటంటే.. ఏకవచన సంబోధనలు, వ్యక్తిగత ఆరోపణలకుదాకా వెళ్లే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ఒరవడి కనిపిస్తోంది. మాటకు మాటతో సరిపోవడం లేదు. కౌంటర్‌కి రివర్స్ కౌంటర్‌ ఇస్తే చాలడం లేదు. ఎన్ని చెప్పుకున్నా ఎంత తిట్టుకున్నా సంతృప్తి చెందడం లేదు. అంతకుమించి అన్నట్లు.. లీగల్‌ నోటీసులతో ప్రత్యర్థులు, ఆరోపణలు చేసినవాళ్లను కోర్టుకీడ్చాలనుకుంటున్నారు నేతలు. కొన్నివారాల వ్యవధిలోనే ఇద్దరి లీగల్‌ నోటీసులతో స్టేట్‌ పాలిటిక్స్‌లో ఇప్పుడు దీనిపైనే చర్చ.

కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్‌కి లీగల్‌ నోటీసు ఇచ్చారు బీఆర్‌ఎస్‌కి చెందిన మాజీ మంత్రి హరీష్‌రావు. అవాస్తవ ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారని న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు హరీష్‌రావు. ఎప్పట్నించో రాజకీయాల్లో ఉన్న హరీష్‌రావుకు ఆరోపణలు, సవాళ్లు కొత్తకాకపోయినా.. ఈసారి కౌంటర్‌తో సరిపెట్టకుండా కాంగ్రెస్‌ ఎంపీకి లీగల్‌ నోటీస్‌ కూడా పంపారు. హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలతో పాటు మూసీ ప్రక్షాళన.. రాజకీయాలను షేక్‌ చేస్తోంది. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి విపక్షపార్టీలు. బీఆర్ఎస్ నుంచి హరీష్‌రావు, కేటీఆర్‌తో పాటు ముఖ్యనేతలు బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో హరీష్‌రావుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.

హిమాయత్ సాగర్ FTL పరిధిలో ఉన్న ఆనంద్ కన్వెన్షన్‌లో హరీష్‌కి వాటాలున్నాయని ఆరోపించారు ఎంపీ అనిల్ కుమార్. మూసీ పర్యటన పేరుతో రాజకీయ డ్రామాలు ఎందుకో తెలుసా.. హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన కన్వెన్షన్‌లో హరీష్ రావుకు వాటాలున్నాయని సంచలన ట్వీట్‌ చేశారు అనిల్‌. కన్వెన్షన్‌ని కాపాడుకునేందుకే హరీష్‌ డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ ఆరోపించారు. ఆస్తులను కాపాడుకునేందుకు సామాన్య ప్రజలను అడ్డుపెట్టుకుంటున్న అగ్గిపెట్టె హరీష్.. ఖబర్దార్ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ ట్వీట్‌కి అదేస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు హరీష్‌రావు కూడా.

ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురదజల్లే వికృత రాజకీయాలకి కాంగ్రెస్‌ తెరలేపిందని హరీష్‌రావు రియాక్టయ్యారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. రేపు గోల్కొండ కోట, చార్మినార్‌లో కూడా వాటాలు ఉన్నాయంటారేమో.. అబద్దపు ప్రచారాలు చేస్తున్నందుకు లీగల్ నోటీస్ పంపుతున్నానని స్పందించారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావాకి రెడీగా ఉండాలని అనిల్ కుమార్ యాదవ్‌ని హెచ్చరించారు. దానిపై కూడా కాంగ్రెస్‌ ఎంపీ తనదైన శైలిలో మరో ట్వీట్ చేశారు. ఆరోపణలపై వివరణ మాత్రం ఇవ్వలేదంటూ.. నిప్పు లేనిదే పొగ రాదనుకోవాలా అంటూ మరో ట్వీట్ వదిలారు అనిల్‌కుమార్‌ యాదవ్‌.

ఈ ఎపిసోడ్‌కి కొన్నాళ్లముందే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కి లీగల్‌ నోటీస్‌ పంపారు సృజన్‌రెడ్డి. ఆయన మరెవరో కాదు సీఎం రేవంత్‌రెడ్డికి బావమరిది వరస. అమృత్ పథకం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీకి లీగల్ నోటీసులిచ్చారు సృజన్‌రెడ్డి. తనపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పట్టణాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో సీఎం కుటుంబసభ్యులు అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్‌ చేసిన ఆరోపణలు దీనికి కారణమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి బావమరిది సృజన్ రెడ్డికి పనులు అప్పగించారని తీవ్ర ఆరోపణలు చేశారు కేటీఆర్.

సీఎం కుటుంబాన్ని కేటీఆర్‌ టార్గెట్‌ చేసుకోవడటంతో కాంగ్రెస్‌ కీలకనేతలంతా స్పందించారు. మంత్రి పొంగులేటి ఆధారాలు చూపాలని సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి కూడా తన అల్లుడు సృజన్‌రెడ్డికి నిబంధనల ప్రకారమే టెండర్‌ దక్కిందని వివరణ ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో సీఎం సెంట్రిక్‌గా బీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేయటంతో.. కేటీఆర్‌కి లీగల్‌ నోటీసులు ఇచ్చారు సృజన్‌రెడ్డి. ఈ లీగల్‌ నోటీసులకు అటు కేటీఆర్‌, ఇటు అనిల్‌కుమార్‌యాదవ్‌ ఇద్దరూ ఇప్పటికైతే ఎలాంటి సారీ చెప్పలేదు. చెప్పే మూడ్‌లో కూడా లేరు. కోర్టుదాకా వస్తే ఎవరి రియాక్షన్‌ ఎలా ఉంటుందన్నదే తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు హాట్‌టాపిక్‌..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..