Telangana: ‘మతం పేరుతో మంటలు, కులం పేరుతో కుంపట్లు..’ బీజేపీపై కేటీఆర్ ఆగ్రహం..

|

Feb 27, 2023 | 6:52 PM

దర్యాప్తు సంస్థల దాడులకు భయపడబోమని అన్నారు మంత్రి కేటీఆర్. ఎందాకైనా పోరాడుతామంటూ ప్రకటించారు. ధరలు పెంచి ప్రజలపై భారం మోపినందుకు మోదీని దేవుడనలా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు 15 లక్షల రూపాయల హామీ ఏమైందన్న కేటీఆర్.. కేంద్రం మాటలు చెప్పడం తప్ప తెలంగాణకు చేసింది ఏం లేదన్నారు.

Telangana: మతం పేరుతో మంటలు, కులం పేరుతో కుంపట్లు.. బీజేపీపై కేటీఆర్ ఆగ్రహం..
Minister KTR
Follow us on

స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో 125 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ జిల్లాల్లో తిరుగుతున్న నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటూ ప్రశ్నించారు. బీజేపీని విమర్శిస్తే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి దాడులకు భయపడేది లేదన్న ఆయన.. ఎందాకైనా పోరాడుతామని ప్రకటించారు. మతం పేరుతో మంటలు, కులం పేరుతో కుంపట్లు.. బీజేపీకి కావాల్సింది ఇదే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణకు పట్టిన శని అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు.

ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అడుగుతున్నాడు.. 10 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేశావ్ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 24 గంటల విద్యుత్, రైతుబంధు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు ఎందుకు లేదన్నారు. 2 వేల రూపాయల పెన్షన్ ఎందుకు అందించలేదు? అంటూ ప్రశ్నించారు.

మూడు లిఫ్ట్‌లు ద్వారా 30 గ్రామాల్లో 6794 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్‌లను కేటీఆర్ ప్రారంభించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీగా మార్చుతామన్న ఆయన.. రాష్ట్రంలో రెండు లక్షల 21 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. 4 కోట్ల మంది ప్రజలు మా కుటుంబ సభ్యులే అన్న కేటీఆర్.. ప్రతిపక్షాలు అనుసరిస్తున్న తీరును ప్రజలు గమనించాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..