తెలంగాణ అసెంబ్లీలో మరోసారి వాడీవేడిగా చర్చ కొనసాగింది. విద్యుత్ రంగంపై అధికార కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేసింది. దీంతో విద్యుత్ అప్పులపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలాయి.. ఈ క్రమంలో బీఆర్ఎస్ విద్యుత్ రంగం, బకాయిలపై చర్చకు సిద్ధమంటూ ప్రకటించింది. చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అంటూ విమర్శించారు. నీళ్లు, బొగ్గు లేని రాయలసీమలో, బొగ్గు లేని విజయవాడలో థర్మల్ పవర్ కేంద్రాలు నెలకొల్పరంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఆ రోజు విద్యుత్ కేంద్రాలు కట్టకుండా, రాష్ట్రం ఏర్పడే నాటికి 27 వందల మెగావాట్ల లోటు నష్టాలతో తమకు అప్పజెప్పారంటూ కేటీఆర్ వివరించారు. శాసనసభలో విద్యుత్ రంగ పరిస్థితిపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. 55 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, నిర్వాకాన్ని వైట్ పేపర్‌లో చాలా గొప్పగా చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వారికి ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే 2014 నాటికి ఆరు గంటల కరెంట్ మాత్రమే ఇచ్చారని.. వారి తప్పులను వారే ఒప్పుకున్నారన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..