KTR: ఎమ్మెల్యే స్థానాల పెంపు ఇంకెప్పుడు..? కేంద్రంపై కేటీఆర్ ఫైర్..

పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని కేటీఆర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ అయ్యిందని .. కానీ ఉత్తరాదిలో అలా జరగలేదన్నారు. అంతేకాకుండా ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే స్థానాల పెంపు ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించారు.

KTR: ఎమ్మెల్యే స్థానాల పెంపు ఇంకెప్పుడు..? కేంద్రంపై కేటీఆర్ ఫైర్..
Ktr

Updated on: Jul 20, 2025 | 6:55 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే స్థానాలను పెంచాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల సమస్యలకు మెరుగైన ప్రాతినిథ్యం కోసం నియోజకవర్గాల పునర్విభజన అవసరమని అభిప్రాయపడ్డారు. ఎంపీ స్థానాలను ఫ్రీజ్ చేసి.. ఎమ్మెల్యే స్థానాలే పెంచాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కూడా ఈ విషయంలో బీఆర్‌ఎస్ అభిప్రాయానికి అనుగుణంగానే ఉంటుందన్నారు. జైపూర్‌లో జరిగిన టాక్ జర్నలిజం 9వ ఎడిషన్‌లో కేటీఆర్ మాట్లాడారు. 2014లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ, ఏపీకి ఎమ్మెల్యే స్థానాలను ఇంకా పెంచలేదన్నారు. అదే జమ్ము కాశ్మీర్, అస్సాం రాష్ట్రాల్లో పెంచినట్లు గుర్తు చేశారు. జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో నష్టం జరగకూడదని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన జనాభా ఆధారంగా సీట్ల పెంపు సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని.. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే నిర్ణయాలకు బీజేపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

దక్షిణాది రాష్ట్రాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ విజయవంతమైందని కేటీఆర్ చెప్పారు. కానీ ఉత్తరాదిలో అలా జరగలేదని..1950 నుంచి ఉత్తరప్రదేశ్‌లో 239శాతం జనాభా పెరుగిందన్నారు. అదే కేరళలో కేవలం 69శాతం పెరుగుదల మాత్రమే ఉందని చెప్పారు. అయినా దక్షిణాదికి తక్కువ సీట్లు కేటాయించడం అన్యాయమని మండిపడ్డారు. బీహార్ ఓటర్ల గల్లంతు అంశంపైనా కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు లక్షల ఓట్లు గల్లంతవడం.. ప్రజాస్వామ్యంపై తీవ్రమైన ప్రమాద సంకేతమన్నారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం స్పందించాలన్నారు. ప్రజలు రోడ్లపైకి రాలేదని అన్నీ బాగున్నట్లుగా భావించకూడదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో బీజేపీపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

జాతీయ భాష అవసరం లేదు

ఫస్ట్ దేశం.. ఆ తర్వాతే కులం, మతం అని కేటీఆర్ అన్నారు. దేశానికి జాతీయ భాష అవసరం లేదని.. హిందీని బలవంతంగా రుద్దడం అహంకార చర్య అని విమర్శించారు. భాషలు, సంస్కృతి, ఆహారం.. ప్రతి 250 కిలోమీటర్లకు మారుతూ ఉంటాయన్నారు. ప్రజలు మాట్లాడని భాషలు కాలక్రమంలో కనుమరుగవుతాయన్నారు. ప్రపంచ దేశాల్లో ఇంగ్లీష్ వల్లే అవకాశాలు లభిస్తాయని.. హిందీతో అవకాశాలు ఉండవన్నారు.