Telangana: తెలంగాణలో ఇక KF బీర్లు కనుమరుగేనా..? ప్రభుత్వం ఏమంటోంది..?

|

Jan 10, 2025 | 7:43 AM

తెలంగాణలో మద్యం ప్రియులకు బిగ్ షాక్. రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లు ఇక కనుమరుగు కానున్నాయి. ఇప్పటికే సరఫరా నిలిపేసినట్లు యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. కేఎఫ్ బీర్లు నిలిచిపోవడానికి కారణాలేంటి?.. యూబీ సంస్థ ఏమంటోంది?. సర్కార్ వర్షన్ ఎలా ఉంది?. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Telangana: తెలంగాణలో ఇక KF బీర్లు కనుమరుగేనా..? ప్రభుత్వం ఏమంటోంది..?
Beers
Follow us on

పండుగ ముందు మద్యం ప్రియులకు పిడుగు లాంటి వార్తనే చెప్పాలి. తెలంగాణలో తమ బ్రాండ్‌ బీర్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ సంస్థ తెలిపింది. కింగ్‌ఫిషర్‌ ప్రీమియం లాగర్‌, కింగ్‌ఫిషర్‌ స్ట్రాంగ్‌, కింగ్‌ఫిషర్‌ అల్ర్టాతోపాటు హీనెకెన్‌ బీర్లను యూబీ సంస్థ సరఫరా చేస్తోంది. బకాయిలు చెల్లించకపోవడం, ధరలు పెంచకపోవడంతో.. తక్షణమే సరఫరా నిలిపేస్తున్నట్లు తెలిపింది యూబీ సంస్థ. దీనిపై తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ లేఖ రాసింది. తెలంగాణ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ధరలు పెంచడం లేదని, 2019 నుంచి పాత ధరనే కొనసాగిస్తోందని, రెండేళ్లకు సంబంధించిన బకాయిలు కూడా విడుదల చేయలేదని లేఖలో తెలిపింది. తెలంగాణలో బీర్ల అమ్మకాలు నిలిపివేసిన విషయాన్ని యూబీ గ్రూప్‌ బొంబాయి స్టాక్‌ ఎక్ఛ్సేంజీ, సెబీకి సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలోని బీర్ల మార్కెట్‌లో యూబీ గ్రూప్ సంస్థ వాటా 69 శాతంగా ఉంది. ప్రస్తుతం ఉన్న ధరను 33శాతం పెంచాలని యూబీ గ్రూప్‌ ప్రభుత్వాన్ని కోరింది.

యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ నిర్ణయంపై స్పందించిన ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు.. యూబీ సంస్థకు ఎక్సైజ్‌ శాఖ 658 కోట్లే బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. గుత్తాధిపత్యం ఉండడంతో ఒత్తిడి చేస్తున్నారని, ఇలాంటి ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో రేటు కొంత తక్కువ ఉన్నా.. ప్రజలపై భారం పడేలా పెంచడం అనేది అసాధ్యమన్నారు.

తామొచ్చాక నయా పైసా కూడా టాక్స్ పెంచలేదన్నారు మంత్రి జూపల్లి. గత ప్రభుత్వం విధించిన ట్యాక్సులే కంటిన్యూ చేస్తున్నామని తెలిపారు. బీర్ల ధరల పెంపుపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీయే.. ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వ బకాయిలు కూడా తాము తీరుస్తూ వస్తున్నామని, సడన్ బీర్ల సరఫరా నిలిపేయడంతో బెదిరించాలని చూస్తున్నారని, అలాంటి టాక్టిక్స్ ఏమీ పనిచేయవన్నారు మంత్రి.

తెలంగాణలో బీర్ల సరఫరా నిలిపివేతపై మరోసారి యూబీఎల్ వివరణ ఇచ్చింది. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తున్నా సప్లై మాత్రం ఆపలేదన్నారు యూబీఎల్ ప్రతినిధులు. బీర్ల ధరలో 70 శాతం ప్రభుత్వ పన్నులే ఉన్నాయన్నది యూబీఎల్ సంస్థ. ధరలు సవరించాలని టీజీబీసీఎల్‌ను అనేకసార్లు కోరామన్నారు. బిల్లుల బకాయిలు కూడా భారంగా మారాయని అందుకే సరఫరా ఆపేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు.. తక్కువ ధరతో బీర్ల సరఫరాకు కట్టుబడి ఉన్నామన్నారు. ధరలు సవరించాలని టీజీబీసీఎల్‌ను మరోసారి కోరుతున్నామన్నారు. సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపింది యూబీఎల్. మొత్తానికి సంక్రాంతికి ముందు లిక్కర్ వార్ పీక్స్‌కు చేరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..