
తెలంగాణలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ సోమవారం, చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో వచ్చి త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కాగా ఇవాళ రాత్రి 7:45 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాలు ముగియనున్నాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా వీఐపీ ఘాట్ వద్ద ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సా. 6 గంటల నుండి వేద స్వస్తి కార్యక్రమం, బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం, మంత్రుల ప్రసంగాలు ఉంటాయని అధికారులు తెలిపారు. రాత్రి 7:46 నుండి 7:54 వరకు డ్రోన్ షో ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, ఇవాళ పుష్కరాల చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో హజరయ్యే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఇక పుష్కరాలకు భక్తులు పోటెత్తడంతో కాళేశ్వరం వెళ్లే రూట్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ జామ్ కారణంగా మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నట్టు సమాచారం. అయితే ప్రైవేటు వాహనాలను ఆలయం, పుష్కర ఘాట్ల వరకు అనుమతించడంతో ఈ ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు నిన్న ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినట్టు అధికారులు తెలిపారు. సుమారు 3.5లక్షల మంది భక్తులు ఆదివారం పుణ్యస్నానాలు చేసి, మొక్కులు చెల్లించుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు కూడా నిన్న పుష్కరాలకు వచ్చి పుణ్యస్నానం ఆచరించారు. తర్వాత శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇక ఆలయానికి వచ్చిన గవర్నర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్దంపతులకు ప్రసాదం, అమ్మవారి జ్ఞాపికను బహూకరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..