
కాళేశ్వరం 3 బ్యారేజీల మరమ్మతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. మరమ్మతులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు . ఏజెన్సీలను అప్రమత్తం చేసి పనులు వేగవంతం చేయాలని సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని సీఎం చేశారు. అలాగే నీటిపారుదలశాఖతో పాటు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయాలని, ప్రతి పనిలో CWC సభ్యులు ఉండేలా చూడాలన్నారు సీఎం రేవంత్. మేడిగడ్డలో కుంగిన పిల్లర్‌తో పాటు మొత్తం బ్యారేజ్‌పై సమగ్ర అధ్యయనం అవసరమన్నారు.
జూబ్లీహిల్స్ నివాసంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. బ్యారేజీల మరమ్మత్తులకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. పనులకు అవసరమైన యంత్రాలు వెంటనే సమకూర్చాలన్నారు. డిజైన్లు సిద్ధం చేసి మరమ్మత్తులు వేగవంతం చేయాలని సూచించారు. డిసెంబర్ వరకు పూర్తి షెడ్యూల్ రూపొందించాలని.. పనుల్లో జాప్యం అస్సలు సహించబోమని స్పష్టం చేశారు సీఎం.
బ్యారేజీల మరమ్మతులకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. మేడిగడ్డ దగ్గర బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని, పనులు ప్రారంభం తర్వాత స్వయంగా పరిశీలనకు వస్తానని అధికారులకు చెప్పారు. ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ.. వేగంగా పనులు జరిగేలా చూడాలన్నారు సీఎం రేవంత్.
ఒకవైపు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి రావడం, సెంట్రల్ వాటర్ కమిషన్ సైతం కాళేశ్వరం మరమ్మత్తులు చేయాలని సూచించడంతో.. కాళేశ్వరం రిపేర్లపై ఫిబ్రవరిలోనే క్లారిటీ ఇచ్చారు సీఎం. కాళేశ్వరం అనేది ప్రజల ఆస్తి అని, దానిని కాపాడేందుకు ప్రయత్నిస్తామన్నారు.
మొత్తానికి రెండున్నరేళ్లుగా.. పడావు పడ్డ ప్రాజెక్టులకు మోక్షం కలగబోతోంది. కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులపై సీఎం ఫోకస్ పెట్టడంతో పాటు.. టైం బౌండ్ పెట్టుకుని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సీఎం నిర్ణయంపై ఉత్తర తెలంగాణ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.